Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedరెండవ విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి క్లారిటీ..

రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి క్లారిటీ..

ఏప్రిల్, మే నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం

అసంపూర్తి నిర్మాణాలకు మోక్షం

వచ్చే మూడేళ్ల లోపట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు

అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో అపోహలు వద్దు

మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్, మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ రెండవ విడత ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు.

ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు చేశామని, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నామని, ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయని, జూన్, జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశామని, నీటి సరఫరా, మరుగు నీటి పారుదల, విద్యుత్‌తో పాటు మౌలిక సదుపాయాల పనులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కేటాయించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైనంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం పథకంలో పెండింగ్ బిల్లులలో 99 శాతం ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments