Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedవెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివాదాస్పద భూములకు సంబంధించి స్టేటస్‌కో కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ అక్కడే ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తి పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ, బాధితుల్లో 311 మంది మాత్రమే కాదని, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు భూముల్లో అక్కడ స్టేటస్ కో కొనసాగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహాశీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

భూదాన్ యజ్ఞ బోర్డు పట్టాలు ఇచ్చిన భూముల్లోనే ఇళ్లు కట్టుకున్నామని వాటిని ప్రభుత్వం ముందస్తు ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేసిందని తమకు న్యాయం చేయాలని 24 మంది ఖమ్మం పట్టణానికి చెందిన బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం భూదాన్ భూముల్లో యథాతథ స్థితిని ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. సుమారు 31 ఎకరాల భూమిలో ఇళ్ల కూల్చివేతలు జరగగా, కోర్టు ఆదేశాలు పొందిన పది కుటుంబాలకు మినహాయింపునిచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్ల గ్రామం, వినోబా నవోదయ కాలనీ. 2014లో 800లకు పైగా పేద కుటుంబాలకు కేటాయించిన భూదాన్ భూములను ప్రభుత్వం అక్రమంగా భావించి, ఇటీవల కూల్చివేతలు చేపట్టింది. గతంలోనే ఇక్కడ ఇళ్ల కూల్చివేతలపై స్టేటస్ కో ఉన్నా, ప్రభుత్వం ఆక్రమణల పేరుతో చర్యలు చేపట్టిందని బాధితులు వాపోయారు. సుమారు 31.07 ఎకరాల భూదాన్ భూమిలో సుమారు 21 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని, గురుకుల పాఠశాల, కెజిబివిల కోసం ఈ భూమిని తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగగా కోర్టు స్పందించింది. గతంలో ఉన్న స్టేటస్ కో (యథాతథ స్థితి)ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments