
సరికొత్త చరిత్రను సృష్టించేందుకు అతి చేరువలో భారత్‌ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకదానిని తీసుకోబోతోందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఉద్దేశించి సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2029 నాటికి దీన్ని అమలు చేసేందుకు అవసరమైన సవరణలను ఆమోదించడానికి పార్లమెంట్ సమావేశం కానున్న నేపథ్యంలో, దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందుగా మహిళా చట్టాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ‘నారీ శక్తి వందన్ అధినియం’ సవరణలు గత స్వప్నాలను సాకారం చేయడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చుతాయని అన్నారు. పాలనలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ, మరింత పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
మన దేశ పార్లమెంట్ కొత్త చరిత్రను సృష్టించే దశలో ఉంది. ఇది గత ఆశయాలను నిజం చేస్తూ, భవిష్యత్ సంకల్పాలను నెరవేర్చే చరిత్ర అవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం మన కార్యసంసృ్కతిలో భాగమయ్యే భారతదేశ నిర్మాణానికి ఇది దారి చూపుతుంది. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యావశ్యకం. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోంది. ప్రతి పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. ఈ నిర్ణయం మహిళా శక్తి, గౌరవానికి అంకితం. సమానత్వంతో కూడిన భారతదేశానికి ఇదో తీర్మానం. ఇక్కడ సామాజిక న్యాయం నినాదానికే పరిమితం కాదు. అది మన పని సంసృ్కతిలో ఒక భాగం. రాష్ట్ర శాసనసభల నుంచి దేశ పార్లమెంట్ వరకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఏప్రిల్ 16, 17, 18 అని మోదీ పేర్కొన్నారు.
2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, ముఖ్యంగా ప్రతిపక్షం 2029 నాటికి అమలు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలు నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ సవరణలు అవసరమని చెప్పారు. 2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్ కల్పించారు. అయితే జనగణన అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు అనుసంధానించబడిన కారణంగా, ఈ చట్టం అమలు 2034 వరకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
దీనిని ముందుకు తెచ్చి 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయడానికి సవరణలు తీసుకువస్తున్నారు. ఈ సవరణలు అమలులోకి వస్తే లోక్‌సభ సీట్ల సంఖ్య 816కి పెరిగి, అందులో 273 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. మహిళా భాగస్వామ్యం పెరగడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను చర్చ, సహకారం, భాగస్వామ్యంతో పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మహిళల్లో ఈ అంశంపై ఉత్సాహం పెరుగుతోందని, శాసనసభలు, లోక్‌సభకు చేరాలన్న ఆశయాలు వ్యక్తమవుతున్నాయని మోదీ అన్నారు. ఈ ప్రక్రియలో మహిళలు చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను ఎంపీలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళల పాత్ర
స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు మహిళల పాత్రను గుర్తుచేసిన ప్రధాని, అవకాశాలు లభించిన ప్రతిసారి మహిళలు దేశానికి విశేష సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రివరకు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను మహిళల నాయకత్వానికి ఉత్తమ ఉదాహరణగా చూపుతూ, ప్రస్తుతం 14 లక్షలకుపైగా మహిళలు స్థానిక సంస్థల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. సుమారు 21 రాష్ట్రాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం వరకు చేరుకుందని చెప్పారు. మహిళల నిర్ణయాధికారంలో పెరుగుదల వల్ల నీరు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని, ‘జల్ జీవన్ మిషన్’ విజయానికి కూడా మహిళా పాత్ర కీలకమని మోదీ వివరించారు. స్థానిక సంస్థల్లో అనుభవం సంపాదించిన లక్షలాది మహిళలు ఇప్పుడు పెద్ద బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారని, ఈ చట్టం అమలు వారి జీవితాల్లో గొప్ప అవకాశంగా మారుతుందని ఆయన అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
అవకాశాలు కల్పించాలి..
దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తె ఆశయాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, వాటి సాధనకు అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ భరోసా ఇచ్చారు. మహిళలు కష్టపడి, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని, వారికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వికసిత భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, 2014 నుంచి మహిళల జీవన చక్రంలోని ప్రతి దశను దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బాలికల రక్షణ, విద్య కోసం ‘బేటీ బచావో- బేటీ పడావో’, గర్భిణీల పోషణ కోసం ‘మాత్రు వందన్ యోజన’, బాలికల భవిష్యత్తు కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ వంటి పథకాలను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఇళ్లు పురుషుల పేర్ల మీదే ఉండేవి. భూమి, దుకాణం, కారు.. ఇలా ఏది చూసుకున్నా మగవాళ్ల పేరు మీదే ఉండేవి. అదంతా సహజమనే భావన ఉండేది. అందుకే మేం పీఎం ఆవాస్ యోజన తీసుకొచ్చాం. దాని కింద మహిళ పేరు మీదే ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు మేం ప్రాధాన్యం ఇచ్చాం అని అన్నారు. ఇలా మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. తాను కుటుంబ జీవితాన్ని జీవించకపోయినా.. ఆ వ్యవహారాలపై అవగాహన ఉందని ప్రధాని సరదాగా వ్యాఖ్యానించారు.




