
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వృషకర్మ. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నాగచైతన్య చేసిన లేటెస్ట్ కామెంట్స్.. అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించబోతున్నామని చెప్పారు. దీంతో క్లైమాక్స్ లో బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందనే చెప్పాలి.
వృష కర్మలో నాగచైతన్య ఇప్పటి వరకు చేయని విధంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించబోతున్నారని సమాచారం. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నాగచైతన్య, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నారని, ఇది చైతూ కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ గా నిలుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆయన సరసన మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా కనిపించనున్నారు. జయరామ్, సత్య అక్కళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.




