Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి..400 మంది మృతి

ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి..400 మంది మృతి

ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని సోమవారం రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే కాబూల్‌లోని డ్రగ్స్ రిహాబిటేషన్‌కు సంబంధించిన ఆస్పత్రిపై పాకిస్థాన్ సోమవారం రాత్రి వైమానిక దాడులు సాగించడంతో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని, 400 మంది వరకు మరణించారని, సుమారు 250 మంది గాయపడ్డారని అఫ్గానిస్థాన్ వెల్లడించింది. ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ప్రారంభించిన ఆపరేషన్ ఘజాబ్ లిల్ హక్‌లో భాగంగానే తాజా వైమానిక దాడులు కొనసాగాయని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. అఫ్గాన్ తాలిబన్ దళాలు సరిహద్దులోని 2600 కిలోమీటర్ల పొడవునా సాగించిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. కాబూల్, నంగర్‌హర్‌లోని తాలిబన్ల నిర్వహణలోని మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు చేపట్టినట్టు పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తాయుల్లా తరార్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.

కాబూల్‌లోని రెండు ప్రాంతాల్లో సాంకేతిక వ్యవస్థ, పేలుడు పదార్థాల గిడ్డంగులను, నంగర్‌హర్‌లోని ఉగ్రవాద శక్తులకు అండగా ఉన్న మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. అయితే అఫ్గాన్ తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి హమ్‌దుల్లా ఫిట్రాట్ ఈ దాడులపై వివరిస్తూ సోమవారం రాత్రి అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో డ్రగ్ రీహేబిలిటేషన్ సెంటర్‌పై పాక్ వైమానిక దాడులు కొనసాగాయని, 400 మంది చనిపోయారని, మరో 250 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. శిధిలాల నుంచి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయని చెప్పారు. ఇంకా శిథిలాల కింద మరో 50 మృతదేహాలు చిక్కుకుని ఉండి ఉండవచ్చని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఆఫ్ఘాన్‌పై దాడి పిరికిపంద చర్య: భారత్

న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments