
న్యూఢిల్లీ ః యుద్ధ తాకిడి హర్మూజ్ జలసంధి మార్గం దాటుకుని భారతదేశపు చమురు ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం గుజరాత్ తీరపు ముంద్రారేవుకు చేరింది.ఇరాన్ అధికారిక, ముందస్తు అనుమతితో ఈ నౌక అత్యంత భద్రతాయుతంగా ఇక్కడికి చేరుకుందని అధికారులు తెలిపారు. దేశంలో వంటగ్యాసు కొ రత లేకుండా చేసేందుకు ఈ చమురు ట్యా ంకర్ రాక ఉపయోగపడుతుంది. ఇక మరో చమురు నౌక భారతీయ పతాకపు నందాదేవి కూడా ఈ జలసంధి మీదుగా బయలుదేరింది. మంగళవారం కాండ్లాకు చేరుతుంది. . ఇప్పు డు ఈ రెండు నౌకలు హర్మూజ్ మీదుగా భారత్ కు చేరడానికి ఇరాన్ అనుమతి పొందాయి. సోమ , మంగళవారాలలో ఈ రెండు నౌకలు భారత్ తీరానికి చేరుతాయని శనివారమే భారత నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ప్రకటించారు.
భారతీయ నావికులు అంతా కూడా ఈ ఉద్రిక్తతల మార్గంలో క్షేమంగా ఉన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 24వరకూ భారతీయ జెండా చమురు నౌకలు ఉన్నాయి. వీటి ప్రయాణానికి కూడా భారతదేశం పెద్ద ఎత్తున దౌత్యయత్నాలకు దిగింది. . ఇప్పుడు ముంద్రా, కాండ్లా రే వులకు వచ్చే నౌకల ద్వారా దాదాపుగా మొత్తం మీద 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి లోడ్ ఉంది. టెహరాన్‌లోని ఉన్నత స్థాయి అధికారులతో నేరుగా చర్చించడం ద్వారానే జలసంధి మీదుగా భారత్‌కు భద్రంగా చేర్చగలమని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. తమ దేశ ఇంధన భద్రతకు ఈ మార్గంలో సరైన హమీ అవసరం అని భారత్ పేర్కొంది.భారతీయ చమురు నౌకలకు ఈ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తామని ఇటీవలే ఇరాన్ అధికారికంగా తెలిపింది. భారత్ తమకు అత్యంత మిత్రదేశం అని ప్రకటించింది.
సౌదీ ఫుజైరా నుంచి భారత్‌కు నౌక జగ్ లాడ్కి రాక నేడు
సౌదీ అరేబియాలోని ఫుజైరా రేవు నుంచి ముడిచమురుతో కూడిన భారతీయ ట్యాంకర్ క్షమంగా సోమవారం బయలుదేరింది. మంగళవారానికి ఈ జగ్ లాడ్కి నౌక 80,800 టన్నుల ముర్బన్ క్రూడాయిల్‌తో తీరానికి వస్తుంది. యుఎఇలోని ఈ రేవు టర్మినల్‌పై ఇటీవలే ఇరాన్ భీకరదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇక్కడి రవాణా నౌకలక ముప్పు ఏర్పడింది. అయితే ఈ దాడుల భయాలు ఉన్నప్పటికీ ఈ చమురు నౌక మంగళవారానికి ముంద్రాకు చేరుకుంటుందని నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. జగ్ లాడ్కి కాకుండా జగ్ ప్రకాశ్ నౌక కూడా ముందుగానే భారత్‌కు చేరింది.




