Thursday, April 23, 2026
Google search engine
HomeUncategorizedఅప్పుడు పట్టిచ్చారు..... ఇప్పుడు పట్టుబడ్డారు

అప్పుడు పట్టిచ్చారు….. ఇప్పుడు పట్టుబడ్డారు

నాడు ఎమ్మెల్యేలకు ఎర.. నేడు డ్రగ్స్ పార్టీ

అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్

పోలీసులకు ఉప్పు అందించిన అప్పటి కోడ్ భాష ‘నారియల్ పానీ లే అయియే’

తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న తాజా డ్రగ్స్ కేసు

మన తెలంగాణ/హైదరాబాద్:  మూడున్నర ఏండ్ల కిందట (అక్టోబర్ 2022) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ పార్టీ రెండు సంచలన కేసులకు బీఆర్‌ఎస్ నాయకుడు, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కేంద్ర బింధువుగా మారింది. అప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర కేసులో పైలెట్ రోహిత్‌రెడ్డి స్వయంగా పోలీసులకు ఉప్పు అందించి నిందితులను పోలీసులకు పట్టించగా , తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు సమాచారం ఇచ్చి పోలీసులకు పట్టించడం కొసమెరుపు.

సరిగ్గా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ సేవించి పట్టుబడగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా అక్కడ అధికార టిడిపికి చెందిన ఏలూరు ఎంపి పట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించి పట్టుబడటంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను, అక్కడ అధికార పక్షం టీడీపీని రాజకీయంగా తీవ్ర ఇరకాటంలోకి నెట్టివేసిందని చెప్పవచ్చు. ఈ కేసులో తమ ఎంపి మహేశ్‌కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అతనికి ఎపి టీడీపి షోకాజ్ నోటీసు జారీ చేసి 48 గంటలలో సంజాయిషీ ఇవ్వాలని కోరింది.

అయితే తమ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనపై బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా డ్రగ్స్ కేసు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రధాన చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. దీనికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిస్పందిస్తూ డ్రగ్స్ పరీక్షకు తాను సిద్దమేనని ప్రకటించారు. మొత్తం మీద రెండున్నర ఏండ్ల కిందట జరిగిన ఎ మ్మెల్యేలకు డబ్బుల ఎర కేసు, తాజాగా డ్రగ్స్ పార్టీ కేసులో బీఆర్‌ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డి కేంద్ర బింధువుగా మారడం గమనార్హం.

అప్పుడు ఏం జరిగింది అంటే

అక్టోబర్ 26. 2022లో మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు (రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి) డబ్బుల ఎరచూపడానికి వచ్చిన రామచ్ంర ద భారతీ (ఢిల్లీ), సింహయాజులు (తిరుపతి), నందకుమార్ (హైదరాబాద్) చర్చిస్తోన్న సమయంలో సైబరాబాద్ పోలీసులు వచ్చి ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడటానికి వచ్చిన ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఉదంతంఅప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన ఫామ్ హౌస్‌లో ముందుగానే నాలుగు సీక్రెట్ కెమెరాలను అమర్చి ఎమ్మెల్యేలతో బేరసారాలను ఆడటానికి వచ్చినవారిని రోహిత్‌రెడ్డినే పట్టించిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. వారిని పోలీసులకు పట్టించడానికి అప్పుడు రోహిత్‌రెడ్డి వాడిన కోడ్ భాష (నారియల్ పానీ లే అయియే) అని సంకేతం ఇచ్చినట్టు కూడా పోలీసులు బయటపెట్టారు. కాగా తాజాగా బయటపడిన డ్రగ్స్ పార్టీపై అగంతకులు ఇచ్చిన పక్కా సమాచారంతో పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు 11 మందిని ఫ్యూచర్ సిటీ పోలీసులు, ఈగల్ టీమ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments