
ఆరుగురికి పాజిటివ్
డ్రగ్స్ పార్టీ జరుగుతుండడంతో పకడ్బందిగా ఈగల్ టీం సోదాలు
కాల్పులు, మాదక ద్రవ్యాల సరఫరాపై దర్యాప్తు జరుగుతోంది
ఈగిల్ అధికారులు
ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు ఆగ్రహాం
మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్ :
మొయినాబాద్ ఫాం హౌస్‌లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు. సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
దర్యాప్తు జరుగుతోంది : ఈగిల్ ఎస్పీ గిరిధర్
ఈగిల్ ఎస్పీ మీడియాతో మాట్లాతూ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్‌లు ఉన్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం గుర్తిస్తే టోల్ ఫ్రీ 1908 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం ఉంచుతామని తెలిపారు.
పుట్టా మహేష్ పై చంద్రబాబు ఆగ్రహాం
ఆంధ్ర ప్రదేశ్ ఎంపి పుట్టా మహేష్ కుమార్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఘటనపై మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపి మహేష్‌కు పార్టీ అధ్యక్షుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
పార్లమెంట్ జరుగుతుంటే డ్రగ్స్‌తో చిందులు వేస్తున్న ఎంపి: వైస్ షర్మిలా రెడ్డి
ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంటే టిడిపి ఎంపి పుట్టా మహేష్ ఫాం హౌస్‌లో కొకైన్‌తో చిందులు వేస్తొన్నాడని ఏపిసిసి చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదెక్కడి బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. పాజిటివ్ వచ్చిన ఎంపి మహేష్‌పై సిఎం చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఎంపి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.




