
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు.
పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(బిఎన్‌ఎస్‌ఎస్ 163) అమలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు. హాల్‌టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పెన్సిల్, షార్ప్‌నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, విద్యార్థులు పెన్నులు, ఎరాయిజర్, జామెట్రీ బాక్స్‌లు ఒకరి నుంచి ఒకరు తీసుకునేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.
ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్
పదవ తరగతి పరీక్షల హాల్‌టికెట్లపై ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు.
విద్యార్థులకు సూచనలు…
సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు. – విద్యార్థులు హాల్ టికెట్, రైటింగ్‌ప్యాడ్, అవసరమైన పెన్నులు, ఎరాయిజర్,పెన్సిల్ తీసుకెళ్లాలి. విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి. విద్యార్థులు సాధారణ దుస్తుల్లోనే పరీక్షలకు హాజరు కావాలి… యూనిఫామ్ ధరించి వచ్చే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ రాయాలి. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు. -www.dse.telangana.gov.in వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.




