Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఇరాన్‌కు ఇదే ఆఖరిరోజు

ఇరాన్‌కు ఇదే ఆఖరిరోజు

దుబాయి: పశ్చిమాసియా పరిణామాలు సోమవారంనాడు గంటగంటకూ మారుతూ ఉత్కంఠకు తెరలేపాయి. తాత్కాలిక యుద్ధ విరమణ ప్రతిపాదనలు.. తిరస్కారాలు.. పరస్పర హెచ్చరికలతో పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయోనని ఆసక్తిని రేపింది. కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరవడం తదితర ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించినట్లు ప్రకటన వెలువడగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. సోమవారంనాడు ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇరాన్‌ను మంగళవారంనాడు ఆక్రమించుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. యావత్ ఇరాన్ తుడిచిపెట్టుకు పో యే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఒక్క రాత్రిలోనే ఆ దేశాన్ని మట్టుబెట్టగలమనారు. ఇరాన్‌పై ఇప్పటి వరకు వేలాది విమానాలను ప్రయోగించామని, అందులో ఒక్కటి మాత్రమే (ఎఫ్ 15) కూలిపోయిందని గుర్తు చేశారు. ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి తమ పైలట్‌ను కాపాడుకోగలిగామని, ఈ విజయాన్ని ఎవ్వరూ కాదలేరన్నారు. అత్యంత ప్రమాదకర గాలింపు చర్యల్లో తమ బలగాలు సత్తాచాటాయన్నారు. ప్రపంచంలో ఏదేశానికి లేని ఆయుధ సంపత్తి అమెరికాకు ఉందన్న విషయం మ రువొద్దన్నారు.

హర్మూజ్‌పై డెడ్‌లైన్ ఒకసారి విధించిన తర్వాత మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని, మంగళవారంనాడు ఇరాన్‌పై దాడులు భారీగా ఉంటాయన్నారు. అంతకుముందు ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన వెంటనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ వైఖరి తమను నిరాశకు గురిచేసిందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ నిర్వహించాల్సిన కర్తవ్యాలను నిర్వహిస్తే త్వరితగతిన యుద్ధం ముగిసిపోతుందని, కొన్ని నిర్దిష్టంగా చేయాల్సిన పనులేంటో వాళ్లకు తెలిసినవేనని వైట్‌హౌస్ వెలుపల మీడియాతో వ్యాఖ్యానించారు. మునుపటి పాలకుల కన్నా ప్రస్తుతం ఉన్నవాళ్లు చాలా విజ్ఞతతో ఆలోచిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు యుద్ధ విరమణ ప్రతిపాదనలపై వైట్‌హౌస్ కూడా స్పందించింది. ఎన్నో రకాల ఆచోచనల్లో అది ఒకటి అని పేర్కొంది.

శాంతి ప్రతిపాదనలతో ముసాయిదా…

మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో సోమవారం అత్యంత కీలకమైన ముసాయిదా శాంతిప్రతిపాదన వెలువడింది. మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్‌లకు పంపించాయి. 45 రోజుల పాటు యుద్ధ విరమణ, వెంటనే హర్మూజ్ జలసంధి తిరిగి తెరవడం వంటి కీలక అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియా సంస్థలకు వెల్లడించారు. తాత్కాలిక కాల్పుల విరమణతో ఇకపై శాశ్వత శాంతికి మార్గం ఏర్పుతుందని, ఈ 45 రోజుల సామరస్య ద్వారం మున్ముందు మంచి పరిణామాలకు దారితీస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్‌లకు పంపించామని నిర్థారించారు. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది.

తాత్కాలిక యుద్ధ విరమణకు సిద్ధంగా లేమని, శాశ్వత యుద్ధ విరమణకే మొగ్గు చూపుతున్నట్లు ఇరాన్ కుండబద్ధలు కొట్టింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అందుకు ఒప్పుకోం’ అని కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తాబా ఫిరదౌసి పౌర్ ‘అసోసియేటెడ్ ప్రెస్’తో వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తమపై ఎలాంటి దాడులు జరగబోవనే షరతు సహా తదితర పటిష్టమైన హామీలతోనే తాము శాశ్వతంగా యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు హర్మూజ్‌పై డెడ్‌లైన్‌ను బుధవారంనాటి వరకు పెంచుతూ ట్రంప్ ప్రకటించారు. అప్పటి వరకు ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు నిలిపివేస్తామని తెలిపారు. తాజాగా ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరిచేందుకు ఒప్పుకోకపోవడంతో అమెరికా వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments