
వాషింగ్టన్: నాటో దేశాలను అమెరికా అధ్యక్షు లు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోశారు. ఆయాదేశాల నేతలు పిరికిపందలు అని స్పందించారు. ఇరాన్‌తో తమ యుద్ధం వేళ నాటో నుంచి సరైన మ ద్దతు లేకపోవడం తప్పిదమని, దీనిని అమెరికా గుర్తు పెట్టుకుంటుందని హెచ్చరించారు. అమెరికా మద్దతు లేకపోతే ఈ సైనిక కూటమి వట్టి చేతకాని కాగితం పులి అవుతుందని విమర్శించారు. ఓ వైపు ఇరాన్ అణ్వాయుధ సంపన్నదే శం అవుతోంది. దీనిని అడ్డుకునేందుకు అమెరి కా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తమతో పాటు కలిసిరావాల్సిన బాధ్యత నాటోకు లే దా? అని నిలదీశారు. ఈ యుద్ధంలో చేతులు కలపాలనే తమ విజ్ఞప్తిని నాటో తిరస్కరించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పోరు లో పెద్దగా నష్టం
లేకుండా తమ సైన్యం విజయం దక్కించుకుందని వివరించారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆధీనం నుంచి తప్పించేందుకు నాటో దేశాలు యుద్ధనౌకలను తరలించాలని వరుసగా ట్రంప్ కోరుతూ వస్తున్నారు. అయితే దీనికి పెద్దగా స్పందన వెలువడలేదు. ఈ క్రమంలో ఆయన తమ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించారు. నాటో దేశాల వైఖరి విచిత్రంగా ఉంది. ఇరాన్ చర్యలతో ఓ వైపు చమురు ధరలు భారీగా పెరిగితే వారు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇరాన్‌కు వ్యతిరేకంగా పోరులో కలిసిరావాలంటే కిమ్మంటున్నారని మండిపడ్డారు. హర్మూజ్ సమస్య వల్లనే చమురు ధరలు పెరిగాయి. దీనిని కూడా నాటో గ్రహించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు.
నాటో మిలిటరీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. అయినా ఈ పోరులో కలిసిరావడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్మూజ్ జలసంధి సంక్షోభంపై పలు ప్రపంచదేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని జర్మనీ, ఫ్రాన్స్ , జపాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రిటన్‌లు సంయుక్త ప్రకటనను వెలువరించాయి. అయితే ట్రంప్ పిలుపు గురించి ప్రస్తావించలేదు. ప్రస్తుత పోరు ముగింపు దిశలోనే ఎటువంటి చర్యలు అయినా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ తెలిపారు. ఉద్రిక్తతల సడలింపు చర్యలు, అంతర్జాతీయ చట్టాల కట్టుబాట్లు అవసరం అని బ్రస్సెల్స్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ సమ్మిట్‌లో పేర్కొన్నారు. పోరు విరమణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం కుదురుతుంది. ఇంతకంటే ఉత్తమ మార్గం లేదని, అయినా ఇప్పటి పోరుకు తాము భాగస్వామ్యపక్షం కాదని ఫ్రాన్స్ నేత స్పష్టం చేశారు. తమ బాధ్యతలేనప్పుడు తమ దేశం హర్మూజ్ విముక్తి దిశలో పాలుపంచుకోవల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా అధ్యక్షులు పరోక్షంగా మండిపడ్డారు.




