
మన తెలంగాణ/నంగునూరు: సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదికగా గురువారం నిర్వహించిన రైతు మేళా రాజకీయ రణరంగం గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీయడంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రై తు మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి శా సన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీ హరి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీ శ్‌రావు హాజరయ్యారు. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సభా ప్రాంగణం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సభ జరుగుతున్న సమయంలోనూ నినాదాల పర్వం కొనసాగడంతో వేదికపై ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా జోక్యం చేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాజకీయ గొడవలు తగవని, సంయమనం పాటించాలని తమ తమ పార్టీ శ్రేణులకు సూచించారు. నేతల విజ్ఞప్తితో కార్యకర్తలు శాంతించడంతో సభ యధావిధిగా కొనసాగింది. ముఖ్య నేతలు సమన్వయం పాటించడంతో చివరకు రైతు మేళా ప్రశాంతంగా ముగిసింది. అయినప్పటికీ నర్మెట్ట పరిసరాల్లో ఈ రాజకీయ రగడ స్థానికంగా చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది.




