
రోజు రోజుకీ మూతపడుతున్న టీ స్టాల్స్, హోటళ్లు
బ్లాక్‌లోనూ స్థిరంగా లేని వాణిజ్య సిలిండర్ల ధర
గ్యాస్ సరఫరా పునరుద్దరిస్తే తప్ప ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న వ్యాపారులు
హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో వాణిజ్య సిలిండర్లకు కటకట
మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం చిన్నచిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు తీవ్రంగా పడింది. ప్రైవేటు వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేయడం వల్ల పరిస్థితి క్రమేణా తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక్కొక్కటిగా దుకాణాలు మూతపడుతూ రోజుకి వందల సంఖ్యలోనే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కొరత కారణంగా చిరు వ్యాపారులు నుంచి రెస్టారెంట్ల వరకు తమ వ్యాపారాలను మూసుకుంటున్నారు. గత వారం రోజులుగా భారీగా హోటళ్లు, మెస్‌లు, చిరుతిళ్లు అందించే బండ్లపై నడిపే వ్యాపారాల వరకు వాణిజ్య సిలిండర్లు దొరక్క తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలపై వాణిజ్య సిలిండర్ల కొరత, సరఫరా నిలిపివేత ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెబుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాల్లో ఆహార పదార్థాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడి సగానికి సగం తయారు చేయడాన్ని నిలిపివేస్తున్నారు. గ్యాస్ సరఫరా మెరుగుపడితే తప్ప యధాతధ పరిస్థితికి రాదని ఖరాకండీగా చెబుతున్నారు. ఇక బ్లాక్‌లో సిలిండర్ కొనాలంటే పెద్ద సాహసమే అవుతోందని వాపోతున్నారు. బ్లాక్‌లో దొరికే వాణిజ్య సిలిండర్లను నాలుగు నుంచి ఆరు వేల వరకు కొనుగోలు చేసుకుని ధరలు పెంచి టిఫిన్లు, ఇతర తినుబండారాలను అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌లో కూడా దొరక్కపోవడం, దొరికినా భారీ ధర చెప్పడంతో వ్యాపారం చేయలేక దుకాణాన్ని, లేదా టిఫిన్ బండిని మూసివేసుకుంటున్నారు.
తీవ్రరూపం దాల్చిన వాణిజ్య సిలిండర్ల కొరత
గత రెండు రోజులుగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రరూం దాల్చడంతో చేసేది లేక రెస్టారెంట్ల వరకు మూసుకుంటున్నారు. ఇక మెస్‌లు, హాస్టళ్ల వంటి చోట్ల మాత్రం ఎంతో కొంత వరకు గ్యాస్ మీద చేసినా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కట్టెల పొయ్యిలపై పరిమితంగా వంట చేసుకుని హాస్టళ్లలో ఉండే విర్థులు, ఉద్యోగార్థులకు అందిస్తున్నారు. ఇండ్లలో వాడుకునే డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా కొంచెం ఆలస్యమైనా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎక్కడైనా హోటళ్లు, మెస్‌లు, బండ్లమీద విక్రయాలు చేసే వారు డొమిస్టిక్ సిలిండర్లు వాడితే భారీ జరిమానా విధించి కేసు నమోదు చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించి చిక్కుల్లో పడ్డం దేనికంటూ వాపోతున్నారు. కొందరైతే గ్యాస్ దొరికితేనే వ్యాపారం చేద్దాం, లేదంటే ఇంకో పని చూసుకుందామని సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా టి పాయింట్లను మూసివేస్తున్నారు. గ్యాస్ దొరికిన వాళ్లు నడుపుతున్నారు, లేదంటే టి దుకాణాలను మూసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా చెన్నై, ఢిల్లీ, సూరత్, బెంగళూరు, భోపాల్, కోల్‌కత్తా వంటి మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.29 కోట్ల గృహ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీటిని 810 డిస్ట్రిబ్యూటర్లు అందిస్తున్నారు. దినసరి గ్యాస్ అవసరాలలో 86 శాతం గృహ అవసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్లు అవసరం ఉంటుందని అధికారిక అంచనా.
బ్లాక్‌లోనూ గుది‘బండ’
బ్లాక్‌లో సిలిండర్లు కొనే వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణంగా రూ. 1,800 నుంచి రూ. 1,900 వరకు ఉండే కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు చేరింది. అది కూడా రెండు మూడు రోజుల ముందు చెబితేనే అందుతుంది. అయితే ఈ ధర నిలకడగా ఉంటుందని చెప్పే పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మహానగరం నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, ధరలు అమాంతం పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడం వంటి కారణాలతో హోటల్ వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా హోటల్ రంగంపై ఆధారపడిన సిబ్బంది నిత్య జీవితం అస్తవ్యస్తంగా మారింది.
వారి కుటుంబ పోషణ అధిక భారం కావడమే కాకుండా హోటల్లో పనిచేసే సిబ్బందికి కూడా వంట చేసుకునేందుకు గ్యాస్ లేకపోవడంతో లెక్కలేనన్ని బాధలు పడుతున్నారు. ఇక రోజువారీగా సిబ్బంది జీతాలు, హోటల్ అద్దె భారం పెరుగుతుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలోని చిన్న హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ మరింత కష్టతరమవుతుందని ఆయా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సరఫరా జరుగుతోంది. బహిరంగ మార్కెటల్లో వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరో వైపు ముమ్మరం చేసింది. వారం రోజుల్లో వాణిజ్య సరఫరా పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.




