Thursday, April 23, 2026
Google search engine
HomeUncategorizedఅడవిలో ఆయుధాలు..జనంలోకి అన్నలు!

అడవిలో ఆయుధాలు..జనంలోకి అన్నలు!

మావోయిస్టు ఉద్యమం అంతం అయిందా? కేంద్రప్రభుత్వం పదేపదే ప్రకటించినట్టుగా ఈనెల 31తో ఆ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? దశాబ్దాల తరబడి ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించి, రహస్య ఉద్యమంలో పాల్గొని సాయుధ పోరాటబాట పట్టిన సిపిఐ (మావోయిస్టు) పార్టీ అంతమైనట్టేనా? లేక తన పార్టీని రహస్య ఉద్యమం వైపు నుండి చట్టంబాట పట్టించిందా? అధికారికంగా మావోయిస్టు పార్టీ చట్టబద్ధంగా ఇతర రాజకీయపార్టీల మాదిరిగానే ప్రజలమధ్యకు వచ్చి చట్టానికి లోబడి తమ కార్యాచరణ కొనసాగిస్తామని ప్రకటించలేదు. పార్టీ కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించాక ఆ స్థానంలోకి వచ్చిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మాటల్లోనే కార్యదర్శిగా ఆయన నియామకం ఇంకా అధికారికం కాలేదు. అటువంటప్పుడు ఆయన చేసే విధానప్రకటన ఏదీ పార్టీ తరఫున అధికారికంగా చేసినట్టు ఎలా అవుతుంది? దేవ్‌జీ చెప్తున్నదానికి, అంతకుముందే లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనీ చెబుతున్నదానికి బోలెడు వ్యత్యాసం కనిపిస్తున్నది. సోను తదితరులు పెద్దసంఖ్యలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి తదితరులు తెలంగాణ డిజిపి ఎదుట లొంగిపోయారు. వారు లొంగిపోయారా లేక అరెస్ట్ అయ్యారా అనేది స్పష్టంగా లేదు. ఆయుధాలు మాత్రం అడవుల్లో దాచి వచ్చామని చెప్తున్నారు.

శాంతిభద్రతలు రాష్ట్రాల సమస్య. వామపక్ష తీవ్రవాద ఉద్యమాన్ని సమర్ధించేవారు, దానిపట్ల సానుభూతి ప్రకటించేవారు.. ఇది శాంతిభద్రతల సమస్య కాదు, సామాజిక సమస్యగా చూడాలని ఎంత చెప్పినా ప్రభుత్వాలు మొదటినుండి నక్సలైట్ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ వచ్చాయి. కాబట్టి నక్సలైట్ ఉద్యమాన్ని 2014లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చేవరకు కూడా కేంద్రం దాన్ని శాంతిభద్రతల సమస్యగానే పరిగణించి అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యతను రాష్ట్రాలకే వదిలిపెట్టింది. 2014 తరువాత ఈ అంశాల్లోకి కేంద్రం చొరబాటు పతాకస్థాయికి చేరింది. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టలను జల్లెడపట్టి వందలాదిమందిని అంతం చేసి, వందల సంఖ్యలో లొంగుబాట్లకు దారితీసిన ఆపరేషన్ ఇది. దీని కొనసాగింపుగా, వందల సంఖ్యలో మావోయిస్టులు బయటకు రావడం లొంగుబాటా, అరెస్టా అనేది స్పష్టంగా లేదు. తిప్పిరి తిరుపతి రెండురోజుల క్రితం పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టే వారు లొంగకపోతే, అరెస్టయి ఉంటే బయట స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు? టివి చానళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఎలా వచ్చింది? పోనీ, బెయిల్ మీద ఉన్నారా? అనేవి ఏవీ తెలియదు. తాము ఆయుధాలను అడవిలో ఉంచి వచ్చామనీ, తమను అరెస్ట్ చేసారనీ చెపుతున్నవారు ముఖ్యమంత్రితో సహా ఇతర అధికారులను, రాజకీయ నాయకులను ఎలా కలుసుకోగలుగుతున్నారు? ప్రజాసమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చెయ్యడానికి అజ్ఞాతంనుండి బయటికి వచ్చినవాళ్ళను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని చెప్పడం లేదు కానీ ఈ గందరగోళం ఎందుకు ఉందనేదే ప్రశ్న.

పోలీసులు ఇది లొంగుబాటు అంటుంటే, దేవ్‌జీ మాత్రం తాము ఆయుధాలు అడవిలో దాచి ఉంచి ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వెళుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆయన ఇంటర్వ్యూలో మొత్తంగా మావోయిస్టు పార్టీ ప్రస్తుత వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత లేదు. చాలా ప్రశ్నల్ని ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. దానినిబట్టి పార్టీగా ఒక సమష్టి నిర్ణయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎవరి దారినవారు బయటికి వచ్చారన్న అభిప్రాయం కలుగుతున్నది. ‘కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం చెప్పండి’ అన్నప్పుడు ఆయన ‘ఇప్పుడు దాని గురించి మాట్లాడను’ అని ఎందుకు దాటవేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనితీరును విశ్లేషించడానికి ఆయన ఎందుకు జంకాలి? మావోయిస్టు ఉద్యమం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న తేడానైనా ఎందుకు ఆయన బహిరంగంగా చెప్పలేకపోతున్నారు? ఐదెకరాల భూమి, కోటి రూపాయల పునరావాసం కోరడం పొరపాటనే ఒక మాటతో సరిపెడితే పోతుందా?

ఎవరికివారు వారి కారణాలతో బయటకు రావడం, లొంగిపోవడం, అరెస్ట్ కావడం జరిగింది కానీ మొత్తం పార్టీగా ఒక నిర్ణయం అయితే జరగలేదనిపిస్తుంది. అటువంటప్పుడు దేవ్‌జీ చెపుతున్నట్టు ప్రజల సమస్యల మీద చట్టం పరిధిలో పోరాటం చేయ్యడానికయినా అజ్ఞాతంలో ఉన్నప్పటి పార్టీ నిర్మాణం బయట జరగడం అంత సులభమయిన పనేనా? ఇప్పటికే వీరిని తమ పార్టీలలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలు సుముఖత వ్యక్తం చెయ్యడం, ఆహ్వానం పలకడం కూడా చూసాం. అలా ఎవరికి నచ్చిన పార్టీల్లో వారు చేరిపోతారా? ఇప్పటికే చాలా ప్రాణనష్టం జరిగింది, అటయినా, ఇటయినా. ఇంకా నష్టం జరగకుండా బయటకు వచ్చినవారి భవిష్యత్ కార్యక్రమం వారినే నిర్ణయించుకోనిస్తే సరిపోతుంది.అయితే, ఇప్పటిదాకా వీళ్ళ సిద్ధాంతాలను, కార్యాచరణను సమర్ధిస్తూ బయట పనిచేస్తున్న ప్రజాసంఘాలు, మేధావుల పరిస్థితి ఏమిటి? కేంద్రప్రభుత్వ విధానంలో భాగంగా ఇప్పటికే అర్బన్ నక్సల్స్ గా ముద్రపడి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయినవారు, ఉన్న ఊరునూ, భార్యాపిల్లలను వదులుకుని వృద్ధాప్యంలో షరతులతో కూడిన బెయిల్ మీద ప్రవాస జీవితం వెళ్ళదీస్తున్నవారు ఉన్నారు.. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఉద్యమంపట్ల ఆకర్షితులై, అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు విడిచినవారి కుటుంబాల మాటేమిటి? అటువంటి కుటుంబాల సంఖ్య తక్కువేం ఉండదు. ప్రస్తుతం బయటకొచ్చి చట్టపరిధిలో పార్టీని నిర్మించి పనిచేసే క్రమంలో అటువంటివారిని గురించి కూడా ఆలోచించాలి.

కేంద్ర బలగాలు నెలల తరబడి ‘ఆపరేషన్ కగార్’ పేరిట సాగించిన నక్సలైట్ నిర్మూలన కార్యక్రమం కారణంగా ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు, అనారోగ్య కారణాలతో అడవుల్లో ఇంకా తుపాకీ చేతబట్టి పోరాటం చేయలేని స్థితిలో మరికొందరు ఈ లొంగుబాట పట్టినట్టు కనిపిస్తున్నది. పెద్దపెద్దవాళ్ళు చనిపోయారు. కేంద్ర కార్యదర్శి నంబళ్ల కేశవరావు, మరో ముఖ్యనేత హిడ్మావంటి ప్రముఖులతోసహా వందలమంది మరణించారు. కడుపులో చల్లకదలకుండా కూర్చుని సిద్ధాంతాలు వల్లేవేస్తూ అందరి గురించి తీర్పులు చెప్పేవాళ్ళను పట్టించుకోవాల్సిన పనిలేదు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి కష్టనష్టాలు ఎదుర్కొన్నవారికి తెలుస్తుంది ఆ పరిస్థితి.‘మరో 15 రోజులే గడువు. మేం చెప్పినట్టుగానే తీవ్రవాదాన్ని అంతం చేసాం. మహా ఉంటే ఇంకో ఏడెనిమిదిమంది ఉండి ఉంటారు లోపల’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ఢంకా బజాయించి చెప్తున్నారు. ‘చర్చలకు వస్తాం.. మాకు సమయం ఇవ్వండి’ అని మావోయిస్టు పార్టీ అధికారికంగా విజ్ఞప్తి చేసినా సరే, కనీస మానవత్వం లేకుండా మొత్తం అందరినీ తుదముట్టించడమే ఈ సమస్యకు పరిష్కారమనేది కేంద్రప్రభుత్వ విధానమైతే, దొరికినవారిని, బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేసినవారిని చంపకుండా అరెస్టు చెయ్యడమో, లొంగదీసుకోవడమో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం.

నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అధికారికంగా మావోయిస్టులను చర్చలకు పిలవాలని తమ విధానాన్ని ప్రకటించి ఉన్నాయి. గతంలో ఒకసారి చర్చల ప్రక్రియ జరిగింది కూడా. అది కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఆ చర్చలు అప్పటి పౌరస్పందన వేదిక కృషి ఫలితంగా జరిగాయి. చర్చలు విఫలం అయినా, అసలు ఇరువర్గాలనూ చర్చల బల్లదాకా తెచ్చిన ఆ వేదికలోని మేధావులు చాలావరకు ఇప్పుడు లేకపోవడమే కాదు, ఆ వాతావరణం కూడా లేకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అందుకు భిన్నంగా మొత్తంగా ఉద్యమాన్నే కూకటివేళ్లతో పెకలించివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడటంనుండి కొంచెం పక్కకు జరిగింది. అందుకే దొరికినవాళ్లను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేసి ఎన్‌కౌంటర్ ముద్ర వేయలేదు ఈసారి. శాంతిభద్రతల సమస్య రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం కుదరదన్న విషయాన్ని విస్మరించి కేంద్రం చేపట్టిన ‘కగార్’ కార్యక్రమంలో కర్రెగుట్టల చుట్టూ ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణకైతే అధికారికంగా అందులో పాల్గొనే అవకాశం గానీ, దాని గురించిన అభిప్రాయం తెలిపే అవకాశం కానీ ఇవ్వలేదు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఎంతమేరకు తెలుసో మనకు తెలియదు.

బహుశా ఈ లొంగిపోయిన లేదా అరెస్టు అయినవారిపట్ల చట్టపరంగా ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం వదిలేస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ రెండవ తేదీ వరకు కొనసాగవచ్చునని తెలుస్తున్నది. ఈ నెల 31న లేదా ఏప్రిల్ ఒకటిన పార్లమెంట్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పనిసరిగా తమ విజయాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రకటిస్తారనడంలో సందేహం అవసరం లేదు.2026 మార్చి 31 తర్వాత ఇక ఈ దేశంలో అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతరించిపోయినట్టేనా, లేక మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించారు కాబట్టి వాటిమీద పోరాటం చేసే వాళ్ళు ఉండరా? ఇది పాలకుల ఆత్మతృప్తికి ఉపయోగపడుతుందే తప్ప దోపిడీ, పీడన ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. అది ఏ రూపంలో అనేది అప్రస్తుతం. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు అడవిలోని ఓ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలు భద్రపరచి వెళ్తారు. అలాగే, మావోయిస్టులు కూడా ఇప్పుడు తమ ఆయుధాలను అడవిలో వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళు వదిలి వచ్చిన ఆ ఆయుధాలను ఇంకెవరో అందుకుని, అజ్ఞాతంలోకి వెళ్తారు. మావోయిస్టు ఉద్యమానికి ముందుకూడా ప్రజల తిరుగుబాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ఉద్యమం లేకపోయినా ఇంకో రూపంలో తిరుగుబాట్లు ఉంటాయి. అడవులు ఖాళీ అయ్యాయి కదా అని మైదానాల మీద పడి అర్బన్ నక్సలైట్ల పేరుతో ఆలోచనలను చంపే ప్రయత్నం మానేసి ప్రభుత్వాలు మౌలిక సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తే మంచిది. సమాజంలో హింసను రూపుమాపే పేరిట హింసకు ఎవరు పాల్పడినా అది సరికాదు.

Delete Edit

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments