Thursday, April 23, 2026
Google search engine
HomeUncategorizedమూసీ నిర్వాసితులకు ఉపాధి.. వసతి

మూసీ నిర్వాసితులకు ఉపాధి.. వసతి

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీనదీ ప్రక్షాళన తద్వారా అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టడానికి ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం విదేశాల్లో పలు నదులను అధ్యయనం చేశామని, రెండేళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్ర పంచంలో అతి పెద్ద నగరాలుగా విలసిల్లుతున్న దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి మహా నగరాలు కూడా నదీ పరీవాహక ప్రాంతం లో అభివృద్ధి చెందినవేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మూసీ ఇన్‌వైట్స్’ పేరుతో శుక్రవారం సాయంత్రం ఒక హోటల్‌లో పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టినప్పుడు

కొందరికి నష్టం కలిగించవచ్చని ఆయ న అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఔటర్ రింగ్‌రోడ్డులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినప్పుడు కొందరి భూములు పోలేదా? కొందరు నిరాశ్రయులు కాలేదా? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అయినప్పటికీ భవిష్యత్ తరాల కోసం కొన్ని కష్టనష్టాలు వచ్చి నా వాటిని సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పిలుపుని చ్చారు. మూ సీని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయడం వల్ల వ్యక్తిగతంగా తనకేమీ ప్రయోజనం కలిగించదని, భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏ రాజకీయ నా యకుడు కూడా తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచిస్తారని, అలాగే ఏ వర్గాన్ని దూరం చేసుకోవడానికి సాహసించరని ఆయన తెలిపారు.

మేమేందుకు పేదవాళ్లను నిరాశ్రయులను చేస్తాం

తమకు కూడా తిరిగి అధికారంలోకి రావాలని ఉండదా? మేమేందుకు పేదవాళ్లను నిరాశ్రయులను చేసి శతృత్వం పెంచుకుంటామని ఆయన ప్రశ్నించారు. వారు ఎక్కడైతే ఇళ్లు కోల్పోతారో అక్కడికి సమీపంలోని ప్రభుత్వ భూముల్లోనే అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లను కట్టించి ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ఈ మంచి పని చేస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని గత పదేళ్లు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కడుపులో విషం పెట్టుకుని అడ్డుకుంటున్నాయన్నారు. తమ సంకల్పాన్ని హర్షిస్తున్న వాళ్లు మౌనంగా ఉంటే, వ్యతిరేకించే వాళ్లు మాత్రం తమపై ద్వేషంతో పేదలను రెచ్చగొడుతున్నారని బిఆర్‌ఎస్, బిజెపిలపై సిఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరాశ్రయులయ్యే ప్రతి కుటుంబానికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని ఇందుకు ఇప్పటికే 10,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని ఆయన భరోసా ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా, తాము చేపడుతున్న ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, పాతబస్తీలో మెట్రో, రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగు తున్నాయని, అభివృద్ధి పనుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని సిఎం తెలిపారు.

ప్రజలపై ఆధిపత్యం చలాయించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

మూసీ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం చేపట్టిన బృహత్ కార్యాచరణ అని ఆయన స్పష్టం చేశారు. అసంపూర్తి సమాచారంతో లేదా ఉద్దేశపూర్వకంగా అర్థ సత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడే కాపలాదారుగా మాత్రమే ఈ అధికారాన్ని వినియోగిస్తానని, ప్రజలపై ఆధిపత్యం చలాయించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటిం చారు. ప్రపంచ చరిత్రను ఒకసారి గమనిస్తే గొప్ప నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే విలసిల్లాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను స్వయంగా న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్, లండన్, సింగపూర్, దుబాయ్ వంటి నగరాలను సంద ర్శించి అక్కడ నదీ తీరాల అభివృద్ధిని గమనించానని ఆయన తెలిపారు.

మనం ఇంకా అభివృద్ధి నిరోధకులుగా మౌనంగా ఉంటే….

ఇతర దేశాలు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంటే, మనం ఇంకా అభివృద్ధి నిరోధకులుగా మౌనంగా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆయన హెచ్చరించారు. గత రెండేళ్ల్లుగా వందల గంటల పాటు నిపుణులు, ఆర్థిక, పర్యావరణ కన్సల్టెంట్లతో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ మూసీ ప్రాజెక్టును పట్టాలెక్కించినట్లు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మేము తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. బుల్‌డోజర్లతో మేము పేదల ఇళ్లను కూల్చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవి చదువుకున్న వాళ్లు మాట్లాడే మాటలా అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు మూడునెలలు అక్కడ నివసిస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యంగా ముందుకు..

నగర నిర్మాణంలో నిజాం ప్రభువుల దూరదృష్టిని సిఎం ప్రత్యేకంగా అభినందించారు. నిజాంలు, బ్రిటిషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారని, ఈసీ, మూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నిర్మించారని సిఎం రేవంత్ అన్నారు. 1908లో వచ్చిన భీకర వరదలకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, నిజాం రాజు చలించిపోయి మోక్షకుండం విశ్వేశ్వరయ్య వంటి గొప్ప ఇంజనీర్ సలహాతో వరద నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు 1921లో నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులే నేటికి కోట్లాది మంది హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్నాయని ఆయన కొనియాడారు. 110 ఏళ్ల క్రితమే నిజాం సర్కార్ అంతటి విజన్‌తో నగరాన్ని నిర్మిస్తే, నేడు మనం ఆధునిక కాలంలో ఆ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, రాజకీయంగా విమర్శలు చేయడం కంటే సూచనలు ఇవ్వడం మేలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.

2050 నాటికి హైదరాబాద్ జనాభా 2 కోట్ల 80 లక్షలకు

12 ఏళ్లు కేంద్రంలో, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు తమ మేథో సంపత్తిని ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాకుండా అభివృద్ధికి ఉపయోగించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 2 కోట్ల 80 లక్షలకు చేరుకోబోతోందని, వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. 1994 నుంచి 2024 వరకు గత పాలకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు చేపట్టిన మంచి విధానాలను తాము కొనసాగిస్తున్నామని, విధానపరమైన అస్పష్టత తమ ప్రభుత్వంలో లేదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

బాపు ఘాట్ కన్యాకుమారి తరహాలో అంతర్జాతీయ గుర్తింపు

నగరంలో మూసా ఈసా నదుల సంగమ ప్రాంతమైన బాపు ఘాట్‌ను కన్యాకుమారి తరహాలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన సంకల్పమని ముఖ్యమంత్రి వెల్లడించారు. కన్యాకుమారి మాదిరిగా బాపూఘాట్ కూడా రెండు నదుల సంగమమని, ఇది ఎంతమందికి తెలుసనీ ఆయన ప్రశ్నించారు. నగరంలోని డ్రైనేజీలు పరిశ్రమల కాలుష్యం వల్ల మూసీ నది కలుషితమై విషంగా మారిందని ఇది హైదరాబాద్ కంటే ఎక్కువగా నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో ఫ్లోరోసిస్ శాపానికి తోడు ఈ కాలుష్యం వల్ల పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తున్నారని ఆ ప్రాంత ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన వాపోయారు. నల్గొండ ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మనపై ఉందని వారిని ఈ మురికి కూపం నుంచి కాపాడటమే మూసీ ప్రక్షాళన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

గాంధీ విగ్రహం వంటి నిర్మాణాలకు రూ. 250 కోట్లు…

ప్రాజెక్టు వ్యయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సిఎం ఎండగట్టారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ. 7,000 కోట్ల ఖర్చు అవుతుండగా గాంధీ విగ్రహానికి సుమారుగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నామని, మిగతా నిర్మాణాలకు కేవలం రూ. 180 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని ఇది ప్రాజెక్టు మొత్తంలో 2 శాతం కంటే తక్కువేనని ఆయన వివరించారు. బిఆర్‌ఎస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ విగ్రహానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే తాము వ్యతిరేకించలేదని ఆయన తెలిపారు. గోదావరి జలాలు 20 టిఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు మూసీలో నిరంతరం 2.5 టిఎంసిల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని, మిగతా 17.5 టిఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నది అందమే కాకుండా దాని వెంబడి ఎకనామిక్ జోన్లు పర్యాటక క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. భారత సైన్యం కూడా తమ పరిధిలోని 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకు రావడం ప్రాజెక్టు ప్రాముఖ్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

లోక కల్యాణం కోసం చేసే ఈ యాగంలో

ప్రాజెక్టును అడ్డుకునే వారు దేవతల యజ్ఞాలను భగ్నం చేసే రాక్షసుల్లా వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక కల్యాణం కోసం చేసే ఈ యాగంలో ప్రతిపక్షాలు రక్తం మాంసాలు పోసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గేది లేదని మేధావులు, నిపుణులు ఇచ్చే ప్రతి సలహాను స్వీకరిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించకపోతే రానున్న కాలంలో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనం ద్వారా భూగర్భ జలాల నాణ్యత పెరుగుతుందని కాలుష్యం తగ్గుతుందని వివరించారు. నగర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తామని ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తోడుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments