Tuesday, April 21, 2026
Google search engine
HomeUncategorizedఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా.. చైనా, రష్యా మద్దతు

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా.. చైనా, రష్యా మద్దతు

టెహ్రాన్ : ఇరాన్‌లో రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ పీఠంపై వారసుడు కొలువుదీరారు. ఇరాన్ అత్యున్నత నేతగా 54 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఆయన నియామకం పట్ల ఇరాన్‌లోని కొన్ని మతపరమైన వర్గాల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కరుడుగట్టిన సిద్ధాంతకర్త అవసరమని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ భావించిందని సమాచారం. అందుకే మొజ్తబాను ఇరాన్ సుప్రీంగా నియమించినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. 88 మంది సభ్యులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్’ వర్చువల్ సమావేశంలో మొజ్తాబాను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది.

మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవి చేపట్టకపోయినప్పటికీ తెర వెనుక నుంచే ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే ప్రచారం ఉంది. 2019లోనే ఆయనపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఆయన మధ్యస్థ స్థాయి మతాధికారి మాత్రమే అయినప్పటికీ ఐఆర్‌జీసీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలపై పూర్తి స్థాయిలో పట్టుంది. 1989లో అయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టాక 37 ఏళ్ల తర్వాత ఇరాన్ నాయకత్వంలో జరిగిన రెండో మార్పు ఇది.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబాయే సరైన వ్యక్తని ఐఆర్‌జీసీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి గతంలో ఇరాన్ నాయకత్వం వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేది. కానీ అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. మొజ్తబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడగానే ఆయన మద్దతుదారులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు విధేయత ప్రకటిస్తూ నినాదాలు చేశారు.

మా సంపూర్ణ మద్దతు మీకే: పుతిన్

ఇరాన్ కొత్త సుప్రీం నేతగా నియమితులైన మొజ్తాబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. మొజ్తాబా తన తండ్రి అలీ ఖమేనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నేత ప్రస్తుత సంక్లిష్ట దశలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి: చైనా

ఇరాన్ సుప్రీం నేతగా ఎవరిని ఎన్నుకున్నా తమ తదుపరి టార్గెట్ ఆయనే అవుతాడని ఇజ్రాయెల్ మిటలరీ ఇటీవల చేసిన హెచ్చరికలపై చైనా ఘాటుగా స్పందించింది. నాయకత్వ మార్పిడి అనేది ఆదేశ అంతర్గత వ్యవహారమని, ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాంతీయ సమగ్రతను తప్పనిసరిగా గౌరవించాలని బీజింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments