
న్యూయార్క్/న్యూఢిల్లీ : భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురు తెప్పించుకునేందుకు అమెరికా వెసులుబాటు కల్పించింది. 30 రోజులు పాటు ఈ వి షయంలో భారతీయ చమురు కంపెనీలకు ఆంక్షలు వర్తించవని , ప్రస్తుత గ ల్ఫ్ యుద్ధం, మిడిలిస్టు తీవ్ర పరిణామాల దశలో ఈ మినహాయింపు కల్పించినట్లు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ శుక్రవారం తెలిపారు. ఓ నెల రోజుల పాటు భారతీయ చమురు రిఫైనరీలు రష్యా నుంచి కొనుగోళ్లకు దిగవ చ్చు. లేదా ఇతరత్రా సరఫరాలకు వీలు కల్పించుకోవచ్చు. అంతర్జాతీయంగా ఇప్పటి చమురు సరఫరాల ఇబ్బందికర పరిస్థితితో ఈ నిర్ణయం తీసుకున్నామ ని మంత్రి వివరించారు. అమెరికాకు భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామ్యపక్ష దేశంగా ఉంది. ఎప్పుడూ కూడా భారత్‌కు సరఫరాల విషయం లో చిక్కులు ఏర్పడరాదని అమెరికా కోరుకుంటుంది. ఎప్పుడూ భారతదేశం అమెరికా నుంచే చమురు తెప్పించుకోవాలని తాము కోరుకుంటామని,
అయితే ఇప్పడున్న పరిస్థితిలో అసాధారణ రీతిలో రష్యా నుంచి చమురు తెప్పించుకునే వీలు కల్పిస్తున్నామని వివరించారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు దిగితే భారత్ ఒక్కటే కాకుండా పలు దేశాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ భారీ స్థాయి సుంకాలు, జరిమానాల టారీఫ్‌లకు దిగారు. ఈ క్రమంలోనే భారతదేశం ఇటీవలి రోజులలో రష్యా నుంచి చమురు దిగుమతిని తెప్పించుకోవడం దాదాపుగా నిలిపివేయడం లేదా ఎక్కువగా తగ్గించుకోవడం చేసింది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన నెల రోజుల మినహాయింపులతో అమెరికా టారీఫ్‌ల బెడద లేకుండా రష్యా నుంచి భారతదేశం చమురు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియతో భారతదేశంలో వెనువెంటనే చమురు సంక్షోభం ఏర్పడే ముప్పు తప్పుతుంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం, తీవ్ర సంక్షోభం, ఇరాన్ పరిధిలో ఉన్న హర్మూజ్ జలసంధి ద్వారా చమురు నౌకల రవాణా నిలిచిపోవడం వంటి పరిణామాలతో పలు దేశాలు క్రమేపీ చమురు చిక్కులలో పడుతున్నాయి.ఈ దశలో అమెరికా నుంచి ఇప్పుడు దక్కిన వెసులుబాటుతో భారత్ ప్రస్తుతానికి సమస్య తీవ్రత నుంచి బయటపడనుంది.




