Tuesday, April 14, 2026
Google search engine
HomeUncategorizedడీలిమిటేషన్‌కు హైబ్రిడ్ ఫార్ములా

డీలిమిటేషన్‌కు హైబ్రిడ్ ఫార్ములా

మన తెలంగాణ/హైదరాబాద్: హైబ్రిడ్ ప్రాతిపదికన సీట్లు పెంచాలన్నదే తమ డిమాండ్ సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలని ఆయన కోరారు. కొత్తగా వచ్చే 272 సీట్లలో 50 శాతం జీడిపి ప్రాతిపదికగా తీసుకోవాలని, మరో 136 సీట్లను జనాభా ప్రాతిపదికగా పెంచాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా గతంలో సీట్ల కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. మొదటగా మహిళా బిల్లు ఆమోదించి తర్వాతే డీలిమిటేషన్‌పై చర్చ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి దేశ ప్రజలకు సంబంధించిన అంశాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను కలిపి తీసుకురావడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

ఎన్డీయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు. సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యమని, రాజకీయాల్లో నెంబర్ ముఖ్యమని, వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందని నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 195 అవుతాయని, సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో  సీట్లు 620కి పెరుగుతాయని, ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రస్తుతం 412 సీట్ల గ్యాప్ ఉందని, అది రానున్న రోజుల్లో 620 సీట్ల గ్యాప్‌నకు పెరుగుతుందని, అప్పుడు ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయని సిఎం రేవంత్ వివరించారు. ప్రస్తుతం 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపికి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమేనని, కానీ యాభై శాతం పెంచితే ఈ రెండు రాష్ట్రాల మధ్య 90 సీట్ల గ్యాప్ పెరుగుతుందన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గింది

ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళుతోందని ఆయన వివర్శించారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి అన్నట్లుగా ఉందని, పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి అనే విధానానికి తాము వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు

ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డిపిని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపాటు వద్దని సూచించారు. దీనికి 2028 వరకు సమయం ఉన్నందున, హడావిడి చేయకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలు

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కావాలనే ఈ రెండు అంశాలను కలిపి బిజెపి రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ఆయన చెప్పారు. దేశ ప్రజలందరికీ సంబంధించి ఈ రెండూ కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందన్నారు. మహిళలకు ఓటు హక్కు సహా సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్ అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కావాలని, కుట్రపూరితంగా దేశ వ్యాప్తంగా కేంద్రం హడావిడి చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయా లని కేంద్రం చూస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను చేయాలన్నదే తమ డిమాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు వద్దని 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని ఆయన గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మహిళా రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని ఆయన కోరారు.

ప్రమాదకర దిశలో డీలిమిటేషన్

ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ వెళుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోడీ చేస్తున్నారని, కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయని, ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవటంతో జనాభా విపరీతంగా పెరిగిందని ఆయన ఆరోపించారు. జనాభా అంతరం వల్లనే నియోజకవర్గాల పెంపును కేంద్రం గతంలో వాయిదా వేసిందని, జనాభా ప్రాతిపదికన చేస్తే చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని, దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారని, ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెబుతున్నారని ఆయన తెలిపారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు భారీగా పెరగనున్నాయని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందని ఆయన తెలిపారు.

అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తా

డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడి పెట్టొద్దని, సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు?. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు, 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ శాసనసభల్లోనూ చర్చ జరగాలని, డీలిమిటేషన్‌పై ఒక కమిటీ వేసి ప్రజాసంఘాల అభిప్రాయాలు కూడా సేకరించాలని ఆయన సూచించారు. 2026లో జనగణన పూర్తి చేసి సమగ్ర చర్చ తర్వాత సీట్ల పెంపు చేయాలని, నియోజకవర్గాల పెంపునకు 2028 వరకు గడువు ఉందని, అప్పటివరకు ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన వివరించారు.

వివక్ష వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు, ఉద్యమాలకు

1967లో 520గా ఉన్న లోక్‌సభ స్థానాలను, 1976లో ఇందిరాగాంధీ 542కు పెంచారని సిక్కిం చేరికతో అది 543కు చేరిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సీట్లు తగ్గడం వల్ల రాజకీయంగా బలహీనవర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచేలా కేంద్రం వ్యవహారించవద్దని ఆయన హితవు పలికారు. బిజెపి నేతలు ముఖ్యంగా ఎంపి లక్ష్మణ్ వంటి వారు యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం వల్ల ఆ ప్రాంత ప్రమోజనాల కోసం దక్షిణాదికి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్ష వల్ల భవిష్యత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు, ఉద్యమాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇప్పటివరకు బిజెపి అధ్యక్షురాలిగా ఒక్క మహిళను నియమించలేదు

60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 46 ఏళ్లలో ఒక్క మహిళ ను పార్టీ అధ్యక్షురాలిగా బిజెపి చేయలేదని, కనీసం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మహిళలను చిన్న చూపు చూడటమే బిజెపి లక్షణమని, ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన బిజెపి పార్టీ ఏర్పాటైంది, ఇప్పటి వరకు 15 మంది బిజెపి అధ్యక్షుల నియామకం జరిగింది, కానీ, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియామించలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా..? బిజెపికి మహిళా నాయకురాలిని అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

పునర్విభజనపై పోరాడుతాం

బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మా ఎంపిలు తెలంగాణను సాధించారని, ఇప్పుడు పునర్విభజనపై పోరాడుతారని ఆయన తెలిపారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని, పార్లమెంట్ లో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్‌దేనని, యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందని, వాళ్ల అవసరం ఇక ముందు ఉండదని, అన్ని దక్షణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తానని ఆయన తెలిపారు.

2001లో వాజ్‌పేయి పునర్విభజనపై చట్ట సవరణ

2024 లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యే వారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2001 లో వాజ్ పేయి పునర్విభజనపైన చట్ట సవరణ చేశారని, దాని వల్ల 2009 లో తెలంగాణకు 17 ఎంపి సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపి సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఎపికి 175 శాసనసభ సీట్లు వచ్చాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments