Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedసంధిపై సందిగ్ధం..

సంధిపై సందిగ్ధం..

లెబనాన్‌లో హెజ్‌బోల్లాపై ఇజ్రాయెల్ వీడని దాడులు, హర్మూజ్‌పై ఇరాన్ మరింత పట్టు దశలో శనివారం పాకిస్థాన్‌లో శాంతి చర్చలకు రంగం సిద్ధం అయింది. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ సెరెనా హోటల్‌లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మధ్యవర్తిత్వ దేశాల ప్రాతినిధ్యం మధ్య పరోక్ష రీతిలో జరుగుతాయి. ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు వేర్వేరు రూంలలో ఉంటాయి. ముఖాముఖీ చర్చలు ఉండవు. పరస్పర ప్రతిపాదనలు, రాజీమార్గాలను మధ్యవర్తుల ద్వారా పరస్పరం అందించడం జరుగుతుంది. ఈ దశలో చర్చలలో ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ స్థాయి దౌత్యవేదికగా మారిన ఈ హోటల్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్ అయింది. ఆదివారం సాయంత్రం వరకూ ఈ హోటల్‌కు వేరే అతిధులు రాకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారిని ఖాళీ చేయించారు.

శుక్రవారం రాత్రి వరకూ కూడా మరుసటిరోజు చర్చలకు సంబంధించి అస్పష్టతనే నెలకొని ఉంది. కాల్పుల విరమణ చర్చల దశలో కూడా కన్పించడం లేదు. ఇరు పక్షాలు పట్టుదలతో ఉన్న కీలక అంశాలతో సీజ్‌ఫైర్ ముందుకు సాగుతుందా? అనేది ప్రశ్నార్థకం అయింది. ముందు తాత్కాలిక శాంతి, తరువాత శాశ్వత రీతిలో రాజీకి వీటుగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు హెజ్‌బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు , గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ ఇరాన్ వీడని ప్రతీకార దాడులతో చర్చలకు ముందుగానే సంకట స్థితి ఏర్పడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. ఇరాన్ పది అంశాల ప్రతిపాదనను పాకిస్థాన్ దాచిపెట్టిందని అమెరికా విమర్శిస్తోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగేవరకూ చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇది చర్చలకు ముందు తమ షరతు అని తెలిపారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ దళాలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది.

ఇప్పటి సీజ్‌ఫైర్‌ను ఇరాన్ గౌరవించడం లేదని, హర్మూజ్‌పై పట్టువీడటం లేదని అమెరికా అధ్యక్షులు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ పద్థతి ఏమి బాగా లేదని వ్యాఖ్యానించారు. శాంతిచర్చలకు ఇరాన్ కనీస పక్షంగా అయినా గౌరవం ఇవ్వకపోతే ఇక ఇవి ముందుకు కదులుతాయా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్ నుంచి తమ గగనతలం ద్వారా డ్రోన్ దాడి జరిగిందని కువైట్ విమర్శించింది. ఇరాన్, ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతు సాయుధ బలగాలు ఈ చర్యకు పాల్పడ్డాయని తెలిపారు. అయితే ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఈ వాదనను తోసిపుచ్చాయి. తమ నుంచి జరగని దాడులను తాము చేసినట్లుగా చెప్పడం కుదరదని తెలిపారు. పరస్పర వాదోపవాదాలు సాగుతూ ఉన్నా , పాకిస్థాన్ వేదికగా చర్చలకు జోరుగా రంగం సిద్ధం అయింది. పాకిస్థాన్‌లో చర్చల దశలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్‌తో తమ దేశ ప్రతినిధి బృందం చర్చలకు అంగీకరించారు. ఇవి వచ్చే వారం అమెరికాలోని వాషింగ్టన్‌లో జరుగుతాయని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు.

అయితే నిర్థిష్ట తేదీ, చర్చనీయాంశాల గురించి తాము చెప్పలేమని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య నేరుగానే చర్చలు ఉంటాయని వెల్లడైంది. అయితే హెజ్‌బోల్లా అనధికారిక సమాంతర బలగాల వ్యవస్థ కావడం,ఈ మిలిటెంట్లతో చర్చల విషయం ప్రస్తావనకు రాకపోవడంతో ఈ వాషింగ్టన్ వేదిక ఫలితం ఇస్తుందా? అనేది సందేహంగా మారింది. చర్చలలో విస్తృత అజెండా ఉంటుంది. ఇరాన్ అణు కార్యక్రమ వివాదాలు, హర్మూజ్ మార్గం, ప్రాంతీయ సుస్థిరత కీలక అంశాలు కానున్నాయి. ఇరాన్‌పై ఆంక్షల పర్వం కూడా ప్రస్తావనకు వస్తుంది. వీటి నుంచి తమకు పూర్తి స్థాయి ఊరటను కల్పించాలని ఇరాన్ పట్టుపడుతోంది. ప్రాంతీయ శాంతిస్థాపనకు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సక్రమ రీతికి హర్మూజ్ పునరుద్ధరణ విషయాలు కీలకం కానున్నాయి.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments