
ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి
ఎల్‌ఎల్‌ఆర్‌కు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్‌లైన్‌లో రాయాలి
ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు
ఆరు మాడ్యుల్స్‌తో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహణ
రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు భద్రతపై రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారిని తగ్గించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు రవాణా శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్సు పొందడం అనుకున్నంత సులభం కాదని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ పరీక్ష ఏదో రకంగా చేసి లైసెన్సుతో బయటపడుతూ వచ్చారు. ఇక మీదట అటువంటి వాటికి చెక్‌పెడుతూ రవాణా శాఖ లైసెన్సుల జారీలో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తు చేసే ముందే ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది.
వాహన ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావడం వంటి ప్రమాణాలను పాటించేందుకు వీలుగా ఈ కొత్త ఎంట్రీ లెవెల్ పరీక్షను నిర్వహించేందుకు రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందో, అది ఉత్తీర్ణత అయిన తర్వాత డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం ఉత్తీర్ణత కావడం జరుగుతుంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ నిబంధన కారణంగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, డ్రైవర్లలో భద్రతా అవగాహన కలిగించినట్లు అవుతుంది.
కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్‌కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ పరీక్షలో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల చొప్పున అన్నింటికీ కలిపి మూడు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్షకోసం అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో ఇల్లు లేదా కార్యాలయం నుంచి ఈ పరీక్షను సులభంగా రాసే వీలుంది. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికెట్ నంబర్‌ను కేటాయిస్తారు. దాని ఆధారంగానే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికార వర్గాల సమాచారం.
తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాలతో మృతి
దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తుంటే తెలంగాణలో ఏటా సుమారు ఏడున్నర వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు 23 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. ఈ క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
లైసెన్సు ఉన్నా రోడ్డు ప్రమాదాలకు గురికావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఇటు ఆయా కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెంచడంతో పాటు రోడ్డు భద్రత మాడ్యుల్స్‌లో ఉన్న అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఈ ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన మెటీరియల్‌ను కూడా రవాణా శాఖ రూపొందించింది. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే తొలి దశలోనే ఈ పరీక్షకు సన్నద్దత కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రవాణా శాఖ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది.




