
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ ప్రకటించారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను, శాసనమండలి చైర్మన్‌ను కలిసి కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే అయినందున ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని, అభయహస్తం అనే దస్త్రంపై రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఉభయ సభల్లో గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో చెప్పారని ప్రస్తావించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ సీనియర్ నేతలు, లీగల్ సెల్ విభాగంతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించారు. అనంతరం బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.
ఎన్టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బిజెపి శాసనసభాపక్షనేత సి.హెచ్. విద్యాసాగర్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే, గవర్నమెంట్ ఆహ్వానించి, దానిని చట్టం కూడా చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును బిజెపి వ్యతిరేకించినా ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కోటి మోసాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 840 రోజులు అయినా ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పెద్ద ఫ్రాడ్ అని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిఎం సంతకం చేసిన ఫైల్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. ఈ ఫైల్ ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఒక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉందని.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.
చట్టం అయితే అన్ని వర్గాలకు లాభం
ఆరు గ్యారంటీలు చట్టం అయితే అన్నివర్గాలకు లాభం కలుగుతుందని కెటిఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం రూ.2,500 ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్రంలోని వృద్ధులందరికీ రూ.4 వేల పెన్షన్ హక్కు వస్తుందని తెలిపారు.రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాల్సిన అనివార్యం ప్రభుత్వానికి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని అన్నారు. రైతుబంధుతో సహా ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుందని చెప్పారు.
ఈ చట్టం వలన అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా రూ.15,000 ఇస్తామని చెప్పారని, 5 లక్షల మంది దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సకాలంలో విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున తాము ఆరు గ్యారంటీలకు చట్టభద్దత కోసం ప్రైవేట్ బిల్లును పెడతామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే లబ్దిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి అయినా తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.
ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలి: ప్రజలకు కెటిఆర్ పిలుపు
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకు చట్ట భద్దత కోసం తాము పెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి నియోజకవర్గాల్లో ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత తాము అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతామని అన్నారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, వెంటనే అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారని, వెంటనే పెంచాలని అన్నారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారని, వెంటనే ఇవ్వాలని,
కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారని, అదీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే హామీలన్నీ చట్ట ప్రకారంగా అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీసి తమకు కావలసిన లబ్ధిని దక్కించుకునే హక్కు ప్రజలకు కలుగుతుందని చెప్పారు. హామీలన్నీ అమలు చేసినానని చెబుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఎక్కడైనా సెక్యూరిటీ, పోలీసు బలగాలు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని కెటిఆర్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ వెళ్లిన అశోక్ నగర్ వస్తారా.. తెలంగాణలోని ఇతర ప్రాంతానికి వస్తారా..అనేది ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు.




