
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఉంటాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. కేసులో ప్రభాకర్ రావు 20 నెలలు అందుబాటులో లేనందుకే విచారణలో జాప్యం జరిగిందన్నారు. ప్రభాకర్‌రావు అందుబాటులోకి వచ్చిన తర్వాతే కేసు విచారణ వేగంగా జరుగుతున్నదని ఆయన తెలిపారు. శుక్రవా రం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న జాప్యం గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభాకర్ రావు అందుబాటలోకి వచ్చిన తర్వాతే కేసు విచారణ వేగవంతమైందన్నారు. పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు తన
ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని లోగడ మీరు ఆరోపించారు కదా? అని ప్రశ్నించగా, తనకు నోటీసు వచ్చినా విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు. సుమారు ఆరు వేల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటే, మీరూ చెక్ చేసుకోకుండా అదే రాశారని ఆయన విలేకరులనుద్ధేశించి అన్నారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో చక్రధర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారణ చేసి కొట్టి వేస్తే హరీష్ రావు తనపై కేసు కొట్టి వేసిందన ప్రచారం చేసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అసలు సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదని ఆయన చెప్పారు.
అసెంబ్లీకి రాకుండా గృహనిర్బంధం
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా మేనల్లుడు, కుమారుడు గృహనిర్బంధం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
హిల్ట్ పాలసీ, టిడిఆర్ భూబదలాయింపుపై కెటిఆర్, హరీష్ రావు సూచించే ఏజెన్సీతో విచారణ జరిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. హిల్ట్ పాలసీ వల్ల రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వారు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
మూసీ విషయంలో వెనకడుగు లేదు
మూసీ ప్రక్షాళన విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భూములు కోల్పోయిన బాధితులను తప్పకుండా ఆదుకుంటామని తెలిపారు. మూసీ అభివృద్ధికి అప్పులు ఇచ్చేందుకు ఏడీబీ సిద్ధంగా ఉందని, దీనికి డిపిఆర్ సాంకేతిక నిపుణుల ద్వారా తయారవుతోందని ఆయన చెప్పారు. మూసీ డిపిఆర్ పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామని ఆయన తెలిపారు. గాంధీ సరోవర్ ఏర్పాటు అవసరం లేదని మహాత్మా గాంధీ మనవడు చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, మనవడు బిఆర్‌ఎస్ ట్రాప్‌లో పడకూడదని ఆయన అన్నారు.
భూముల విక్రయానికి వ్యతిరేకం కాదు..
భూముల విక్రయానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని కాకపోతే నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించాలే తప్ప జేబులో వేసుకోవడానికి కాదన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాలేదు కానీ రూ.44 వేల కోట్ల అప్పు చెల్లించామని ఆయన చెప్పారు. ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉందన్నారు. కెసిఆర్, కెటిఆర్‌కు ఏమి చెప్పినా చెవుటోడి ముందు శంకం ఊదినట్లేనని అవుతుందన్నారు. తాను ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళానన్నది లెక్క పెడుతున్న బిఆర్‌ఎస్ నాయకులు తాను ఎన్ని నిధులు తెచ్చానన్నది లెక్క పెట్టాలని ఆయన సూచించారు. జాతిపిత ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు.
బిజెపి-బిఆర్‌ఎస్ ఒకటే అనడానికి ఇదే నిదర్శనం
రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా, ఈ మధ్య పోలీసులపై కాల్పులు జరిగినా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఏ మాత్రం స్పందించలేదన్నారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీలూ కలిసే ఉన్నాయని స్పష్టమవుతున్నదని ఆయన విమర్శించారు.వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, తానే మళ్లీ సిఎం అవుతానని ఎలా చెబుతున్నారని ప్రశ్నించగా, పాఠశాలల్లో విద్యార్థులను పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నిస్తే పెద్దయ్యాక ఐపిఎస్, ఐఏఎస్ అవుతానని చెబుతారని ఆయన అన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న తాను ముఖ్యమంత్రి అయ్యానని, భవిష్యత్తులోనూ ఆశించిన వారికి అభ్యంతరం చెప్పడం ఉండదన్నారు. అయితే ఏదైనా సిఎల్‌పి సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. తాను మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కొంత మంది మంత్రులు కోరుకుంటున్నందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏ పదవి అయినా చేపట్టే వెసులుబాటు స్వేచ్ఛ ఉంటుందని ఆయన తెలిపారు. ఆశించిన వారికి అభ్యంతరం చెప్పడం కానీ, అడ్డుకోవడం కాని జరగదని అన్నారు.
అజహరుద్దీన్ ఫైలు గవర్నర్ వద్ద
మంత్రి అజహరుద్దీన్ ఇంత వరకు చట్ట సభకు ఎన్నిక కాలేదని, వచ్చే నెలాఖరున మంత్రిగా ఆరు నెలల గడువు ముగియనున్నదని ఓ విలేకరి ప్రశ్నించగా, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. అయినా ఇంకా నెల రోజులకు పైగా గడువు ఉంది కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న మీనాక్షి
తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి టి.
జీవన్ రెడ్డి గురించి విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌ను అడగాలని ఆయన దాట వేశారు. ఆపరేషన్ కగార్ అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయమని, మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలని, భద్రత కల్పిస్తామని తాము పిలుపునిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
వంగపెట్టి, బండ రాయి పెట్టి..
బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకోవడం గురించి ప్రశ్నించగా, ఊర్లలో బంజరు దొడ్డి వద్ద వంగపెట్టి వీపుపై బండరాయి పెట్టి కట్టేసినట్లు చేయాలన్నారు. జిహెచ్‌ఎంసిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది వారికి అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. జిల్లాలు, మండలాల పేర్లు ఏవీ మారబోవని ఆయన పునరుద్ఘాటించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి మమ్మల్ని, అసెంబ్లీకి మిమ్మల్ని రానీయలేదని ఆయన విలేకరులనుద్ధేశించి అన్నారు.




