Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedఫలించని బుజ్జగింపులు

ఫలించని బుజ్జగింపులు

మనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: సారీ శ్రీధర్… ఇంత కాలం ఓపిక పట్టాను. నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేసిన నాకు గౌరవం దక్కనప్పుడు, పార్టీని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇంకా పార్టీలో కొనసాగడం బాగుండదు. ఇంత దూరం వచ్చాకా నా నిర్ణయం లో మార్పు అనేది ఉండదంటూ జీవన్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎదుట కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ గత పక్షం రోజులుగా ప్రచారం జరుగుతుండగా శనివారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి జగిత్యాలలోని జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో మంతనాలు జరిపారు.

సుమారు అరగంటకు పైగా జీవన్‌రెడ్డితో మంత్రులు, ఎమ్మెల్యే మంతనా లు జరిపి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మీరు పార్టీని వీడొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే గత 20 నెలలుగా పార్టీలో తనకు జరిగిన అన్యాయం, అగౌరవం గురించి మంత్రుల ఎదుట జీవన్‌రెడ్డి వాపోయినట్లు సమాచారం. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడే పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చానని, అనాడు మీరు నా ఇంటికి వచ్చి మీ గౌరవానికి ఎక్కడా భంగం కలగదని, మీకు అండగా మేమున్నామంటూ మాట ఇవ్వడం వల్లే నేను ఓపిక పట్టి పార్టీలో కొనసాగానని చెప్పినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోగా, నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వచ్చిందని తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఇంకా అవమానాలు భరించుకుంటూ పార్టీలో కొనసాగడం నాతో కాదు ప్లీజ్… నన్ను వదిలేయండి అంటూ మంత్రులకు జీవన్ తేల్చి చెప్పినట్లు అయన అనుచరులు తెలిపారు.

జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు:

మంత్రి శ్రీధర్‌బాబు

జీవన్‌రెడ్డి కాంగ్రెకు పెద్ద దిక్కు, వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు. మేమంతా అభిమానించే నేత. జీవన్‌రెడ్డి మనసు నొచ్చుకున్న విషయమై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పార్టీ పెద్దలందరికీ వివరించాం. వారు కూడా ఆయనతో మాట్లాడి పార్టీని వీడొద్దని కోరారు. పెద్దమనిషిని కలిసి అన్ని విషయాలు మాట్లాడేందుకే మేము వచ్చాం. వారు అన్ని విషయాలను మాతో పంచుకున్నారు. వారు చెప్పిన విషయాలన్నింటిని పార్టీ పెద్దలకు వివరిస్తామని, పార్టీ మారాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరగా ఆయన ఆలోచిస్తానని చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు విలేకరులకు వివరించారు.   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments