Tuesday, April 14, 2026
Google search engine
HomeUncategorizedగ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ చలివేంద్రాలు

గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ చలివేంద్రాలు

గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్‌కు మంత్రి సీతక్క ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను గ్రామ పంచాయితీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే వారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణ సమయంలో అలసటకు గురయ్యే వారికి, కూలీలు, రైతులు, రోజువారీ పనుల కోసం వెళ్లే ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు పూర్తి కాగా, ప్రజలు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క కోరారు. గత ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి తాగునీరు అందించారని అన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. వేసవి వేడి కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాల ఏర్పాటుకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్లు శాఖ డైరెక్టర్ దివ్యా దేవ రాజన్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments