Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఆలయాల్లో రాజకీయాలొద్దు

ఆలయాల్లో రాజకీయాలొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా లో నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. సోమవారం(ఏప్రిల్ 6) రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించిన సిఎం పలు మార్పులు సూచించారు.

సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బా సర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించా రు.భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రో డ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్తులో భారీ వృ క్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని… పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని… ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ద్వారానే చేరుకునేలా చూడాలని ఆదేశించారు.

ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సిఎం హెచ్చరించారు. జ్ఙాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments