Friday, June 12, 2026
Google search engine
HomeUncategorizedకాంగ్రెస్ అరాచకాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం

కాంగ్రెస్ అరాచకాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బిఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. నూతనంగా మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పార్టీ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ (బంటి)తో పాటు, పార్టీ శ్రేణులకు కెటిఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అడ్డదారుల్లో మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా, మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్ల ధైర్యానికి ఆయన సెల్యూట్ చేశారు.

అలాగే క్యాతనపల్లి విజయంలో మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణలో అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు తావులేదని ఈ ఎన్నికల తీర్పు స్పష్టంగా తేల్చి చెప్పిందని అన్నారు. కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చాటిచెబుతున్నాయని అన్నారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని కెటిఆర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments