
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారెంటీల కు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై బిఆర్ఎ స్ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫార్ములా ఈ -కార్ రేస్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ ఆరోపించారు. సిఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బిఆర్ఎస్ బ యటపెట్టడంతో సర్కారు పూర్తిగా ఇరకాటంలో పడిందన్నారు. తాను మొదటినుంచి చెబుతున్నట్లుగానే ఇది ముమ్మాటికీ లొట్ట పీసు కేసే అని పే ర్కొన్నారు. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వమే చ ర్జిషీట్‌లో ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన 45 కోట్ల నిధులు అక్కడి బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయని, తెలంగాణ నుంచి పంపిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదని తెలిపారు. ప్రభుత్వం గోరంతలను కొండంత లు చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
ఇక్కడి నుంచి 45 కోట్లు పంపితే రూ.600 కోట్ల నుంచి – రూ.700 కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని, ఇలాంటి అభూత కల్పనలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తుందో వారి పేరే చార్జిషీట్లో లేదని అన్నారు. సంస్థ ఖాతాలో భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తెప్పించవచ్చు కదా…? అని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్టాత్మక రేసును నగరానికి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కారు రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందని చెప్పారు. అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం జరగలేదని, పైగా అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్ట పాలైందని విమర్శించారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యుకె చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు పోయిందని అన్నారు. అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.
సిఎం సరదా కోసం ఆడిన ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం 100 కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. సింగరేణి సంస్థ నుంచి 10 కోట్లు దుర్వినియోగం చేసిందని, ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైన కూడా ఎలాంటి కేసు పెట్టలేదని అన్నారు. ఎలాంటి తప్పు జరగని ఫార్ములా రేసు కేసు కోర్టులో నిలబడదని, ఇదంతా దృష్టి మళ్లించడానికి మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో న్యాయపోరాటం చేస్తామని.. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కేసులో చివరికి న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్షతో అధికారులను వేధించడం సరైనది కాదని, కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని పేర్కొన్నారు. తొలిసారి నిర్వహించిన ఫార్ములా రేసు వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగిందని, రెండోసారి దురుద్దేశంతో ముఖ్యమంత్రి రద్దు చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించే అంశాన్ని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.
ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది
కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధి పైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నదని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదు అని, కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధుల కోసం ప్రయత్నిస్తున్నారని, ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని అన్నారు. వాళ్లకు అవసరమైన డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదని ఆరోపించారు. అందుకే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి తమ పార్టీ అభిప్రాయాన్ని ఇటీవల గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ ప్రజంటేషన్‌లోనే సమగ్రంగా చెప్పామని తెలిపారు. కానీ మంత్రులు, ప్రభుత్వం చేయాల్సిన చర్చలు ఫైవ్ స్టార్ హోటల్ లోనో, సెక్రటేరియట్లో కాకుండా మూసీ బాధితులతో జరగాలని అన్నారు. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, మేధా పాట్కర్, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ మూసీ ప్రాజెక్టు ప్రజల అభీష్టం మేరకు జరగాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయాలి
డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలని, అయితే ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. 12 ఏళ్ళ కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే అని పేర్కొన్నారు. అయితే, జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. దక్షిణ భారతదేశం అంతా కలిసి దేశంలోని 24 శాతం రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉందని, దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంపును స్వాగతించారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పై వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయని, కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఆర్థిక సూచికలలో అగ్రభాగాన ఉన్నాయని చెప్పారు. దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తామని తెలిపారు.
టిడిఆర్ అతి పెద్ద కుంభకోణం
టిడిఆర్ అనేది అతి పెద్ద కుంభకోణం అని కెటిఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు టిడిఆర్‌ను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్‌కి తెరలేపబోతున్నారని సంవత్సరంన్నర క్రితమే తాను చెప్పానని గుర్తు చేశారు. బలవంతంగా టిడిఆర్లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను తీసుకువచ్చిందని అన్నారు.తమ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత టిడిఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి టిడిఆర్‌ను తన కుటుంబానికి ఒక ఎటిఎంలా మార్చుకున్నారని, త్వరలోనే టిడిఆర్ స్కామ్‌ను పూర్తిగా బయటపెడతామని వెల్లడించారు.




