
సిఎంగా, ప్రధానిగా 8,931 రోజుల
చారిత్రాత్మక మైలురాయి దాటిందన్న
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పావన్ కుమార్ చామ్లింగ్ రికార్డును ప్రధాని నరేంద్ర మోడీ అధిగమించి సిఎంగా, ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ప్రధాని మోడీ జీవితం, ప్రజలకే అంకితమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో అత్యంత కాలం పాటు ప్రభుత్వాధినేతగా సేవలందించిన నాయకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధానిగా మొత్తం 8,931 రోజుల పాటు ప్రజాసేవలో కొనసాగుతున్న మోడీ ప్రయాణం అంకితభావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన వివరించారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే భావనతో దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.
2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా వచ్చిన విజయాలు, ప్రజా మద్దతు, నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన తెలిపారు. 24 ఏళ్ళలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశ సేవలో నిరంతరం పని చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని, ముఖ్యంగా యువతకు ఆయన జీవితం ఒక ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్న ప్రధాని మోడీ ప్రయాణం దేశ ప్రజాస్వామ్య శక్తికి ఒక గొప్ప ఉదాహరణ అని రాంచందర్ రావు పేర్కొన్నారు.




