Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedఏటా రూ.20 వేల కోట్ల బిసిల బడ్జెట్ ఏమైంది: తలసాని

ఏటా రూ.20 వేల కోట్ల బిసిల బడ్జెట్ ఏమైంది: తలసాని

ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కామారెడ్డి బిసి డిక్లరేషన్ పరిస్థితి ఏమిటి

బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు పది వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు

42 శాతం బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం కండితుడుపుగా వ్యవహరించింది

శాసనసభ జీరో అవర్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గడచిన ఎన్నికలకు ముందు కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను బిసిల కోసం కేటాయిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కేటాయించారో స్పష్టం చేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలా ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. శాసనసభలో బుధవారం జరిగిన జీరో అవర్‌లో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బిసిలకు మీరిచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని కోరారు.

బిసి విద్యార్థులకు ఫీజులు అందక బకాయిలు పడి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. దాదాపు పది వేల కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాను బిసిల ప్రతినిధిగా చెప్పే ఈ అంశం చాలా గంభీరమైందని పదే పదే చెబుతూ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్దత లేకుండా బిసి రిజర్వేషన్లు ఎలా సాధ్యపడతాయని గతంలోనే తాము ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. చివరకు బిసిలంతా దగాపడి 42 శాతం రిజర్వేషన్లుకు నోచుకోని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో బిసిలకు ఎక్కువ కేటాయింపులు చేయడంతో పాటు బిసిలకు ఏటా రూ.20 వేల కోట్ల నిధుల కేటాయింపుపై ఇప్పుడైనా ప్రభుత్వం శాసనసభ వేదికగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బిసిల పట్ల చులకన భావన వద్దని తలసాని కోరారు. సభ్యుడు తలసాని ప్రస్తావించిన అంశాలపై సభలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన అంశాలను తప్పకుండా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు. సీనియర్ సభ్యుడైన తలసానికి జీరో అవర్ అంటే తెలియనిది కాదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments