
కన్న తల్లిని కొట్టి.. ఆ తర్వాత మనస్తాపంతో ఓ బిజెపి నేత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కుటుంబ కలహాల కారణంగా ఉప్పల్ బిజెపి లీడర్ రేవల్లి రాజు.. తన తల్లిని కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లిని కొట్టిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రేవల్లి రాజు మనస్తాపానికి గురై.. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానిక చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యకు ముందు రేవల్లి రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రపంచంలో ఏ కొడుకు కూడా తన తల్లిని కొట్టాలనుకోడని.. తనను మోసం చేసిందని భాద, కోపంతో తన తల్లిపై చేయి చేసుకున్నానని.. అందుకు తనను క్షమించాలని సెల్పీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య, పిల్లలు అమాయకులని.. తాను చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని తన మిత్రులను వేడుకున్నాడు. రేవల్లి రాజు ఆత్మహత్యతో అతని భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.




