Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedరూ.7వేల కోట్ల భూమికి ఎసరు

రూ.7వేల కోట్ల భూమికి ఎసరు

 నాదర్‌గుల్‌లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నాలు

ఈ భారీ భూ కుంభకోణం వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం

బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు సిఎం వెంటనే చర్యలు చేపట్టాలి

హైడ్రా కమిషనర్ తక్షణమే కలుగజేసుకోవాలి లేకపోతే మా

ఎంఎల్‌ఎలతో కలిసి అక్కడికి వెళ్తాం: బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉన్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టే హైడ్రాకు .. అధికార పార్టీ నేతల వేల కోట్ల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కనిపించదని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి అనుమతించాలని అన్నారు. నాదర్‌గుల్ భూములపై సోమవారం ఉదయం వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోకపోతే.. ఎంఎల్‌ఎలతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. రక్షకులే భక్షకులుగా మారారని విమర్శించారు. నాదర్‌గుల్ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఎపిఐఐసికి అప్పగించారని చెప్పారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఆ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని పేర్కొన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నాదర్‌గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతుండగా, 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు.2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పింది.

373 ఎకరాలు ఉండే అవకాశం లేదు

రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని హరీష్‌రావు అన్నారు. కానీ, 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించారని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22ఎ కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్‌డిఒ తేల్చిచెప్పారని అన్నారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టం చేశాయని తెలిపారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఈ కేసు 2026 ఏప్రిల్ 7న విచారణకు పెండింగ్‌లో ఉందని అన్నారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదు కాబట్టి హైకోర్టు తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఇది ప్రభుత్వ భూమి అనే స్పష్టం చేశారని, ఆదివారం ఉదయం భూభారతి వెబ్‌సైట్‌లో చూసినా ఇది ప్రభుత్వ భూమి నిషేదితగానే చూపిస్తోందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments