
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో వరుస దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం నాడు బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ లకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు దేశాలపై జరిగిన దాడులను ఖండించారు. క్లిష్ట పరిస్థితులలో భారతదేశం ఆ దేశాల ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. బహ్రెన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ , ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ లతో ప్రధాని టెలిఫోన్ లో సంభాషించారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత్వ త్వరలో పునరుద్ధరించబడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. క్లిష్ట పరిస్థితులలో కూడా భారతీయుల క్షేమం పట్ల శ్రద్ధవహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు తలపడింది.
ముఖ్యంగా పశ్చిమాసియాలలో పలు దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు జరిపింది. ముఖ్యంగా దుబాయ్, దోహాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ టెలిఫోన్ సంభాషణలు చోటు చేసుకున్నాయి.ప్రధాని అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యుఏఇ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడారు. గల్ఫ్, పశ్చిమాసియాలో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ లో దాదాపు 10 వేల మంది భారతీయులు ఉన్నారు వారిలో విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ లో 40 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు అన్నిదేశాల నుంచి విమాన సర్వీసులు నిలిచి పోయాయి.




