Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి

ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలకు 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అయితే, ఉదయం 9 తరువాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా కూడా అనుమతిస్తామని వెల్లడించారు. తాము ఇచ్చే 5 నిమిషాల గ్రేస్ పిరియడ్‌ను సానుకూల దృక్పథంతో చూడాలని అన్నారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడం వల్ల ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతాయని తెలిపారు.

ముఖ్యంగా ట్రాఫిక్ రద్ధీ ఉండే ప్రాంతాలలో విద్యార్థులు పరీక్షా సమయం కంటే ముందే చేరుకోవాలని, తద్వారా ఒఎంఆర్ షీట్ ప్రశాంతంగా నింపుకోవచ్చని, హడావుడి ఉండదని చెప్పారు. అందుకే పరీక్షా సమయానికి అరగంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నేపథ్యంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద భాయి, ఇతర అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది, రెండో సంవత్సరం ప్రైవేటు 54,017 మంది కలిపి మొత్తం 5,07,949 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డ్యుయల్ డెస్క్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ కేంద్రంలో తాగునీటితో విద్యార్థులు అవసరమైతే వైద్య సహాయం అందించేందుకు అవసరమైన మందులు మెడికల్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు

ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దాంతోపాటు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు పంపించినట్లు తెలిపారు. విద్యార్థులు ఎస్‌ఎంఎస్ లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రశ్నపత్రం కూర్పు మొదలు కొని, పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్ల వరకూ జాగ్రత్తలు పాటించామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షల కోసం 1,495 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయగా, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1,495 డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసి అధికారులతో, పోలీస్ అధికారులు, పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడితో ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కోసం 24*7 అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు టెలీ మానస్ నెంబర్ : 14416 లేదా 91 8069391416 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. హాల్ టికెట్, ఇతర సమస్యలతో పాటు మానసిక నిపుణులు, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగానికి చెందిన నిపుణులు అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు. అవసరమైన విద్యార్థులకు నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత మానసిక ఆరోగ్య సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆందోళన చెందే విద్యార్థులు టెలీ మానస్‌కు కాల్ చేసి, మానసిక ధైర్యం పొందాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కృష్ణ ఆదిత్య సూచించారు.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9,97,075 మంది

ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,53,932 మంది

ద్వితీయ సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు 54,017 మంది

పరీక్షా కేంద్రాలు 1,495

ఇన్విలేటర్లు 28,500

ఫ్లైయింగ్ స్కాడ్లు 75

సిట్టింగ్ స్కాడ్లు 200

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments