
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సం ఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో మూడో విడతగా తెలంగాణకు రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.1034.42 కోట్ల నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే, తెలంగాణకు ఇంకా సు మారు రూ.2000 కోట్ల మేర 15వ ఆర్థిక సం ఘం నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నిధులు ఆలస్యం కావడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగాలంటే నిధుల సమయానుకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, అలాగే గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.




