
లంచంపై ఆధారాలు లభ్యం
ప్రకటనలో పేర్కొన్న ఎసిబి అధికారులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎసిబి దాడులపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గండిమైసమ్మ వద్ద ఉన్న దుండిగల్ మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు బుధవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, కార్యాలయ పనితీరును తనిఖీ చేశారు. కింద అక్రమాలు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.
టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ వాట్సాప్ చాట్‌లలో లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. సూపర్‌వైజర్ భర్తకు చెందిన సంస్థకు అనధికారికంగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించి, వారి ఖాతాల్లోకి వచ్చిన నిధుల మూలాలను, అక్రమాలతో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కార్యాలయ రికార్డులు, డిజిటల్ డేటా, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సమగ్ర నివేదిక పంపనునట్లు పేర్కొన్నారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు.
శానిటరీ ఫీల్ అసిస్టెంట్ల ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది.
49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 12 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నా, 21 రోజుల గడువు దాటిపోయినా పెండింగ్‌లోనే ఉంచారు.
32 అనధికారిక నిర్మాణ కేసులలో, 28 కేసులకు సంబంధించి రెండో నోటీసు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
జి+3 (మూడు అంతస్తులు) అనుమతి ఉన్న చోట, అక్రమంగా నిర్మించిన జి+5 (ఐదు అంతస్తులు) భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు.




