
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మండల విద్యుత్ సంస్థలో (టిజిఎస్‌పిడిసిఎల్) వస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తం 8 మందిని (4 ఇంజనీర్లు, ముగ్గురు లైన్‌మెన్‌లు, ఒక ఆర్టిజన్‌ను) సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించమని ప్రభుత్వం ఈ సంఘటనతో రుజువు చే సింది. అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విద్యుత్ శాఖలో పా రదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టిజిఎస్‌పిడిసిఎల్ సంస్థలో పలువురు అధికారుల అవినీతి నిజమని విజిలెన్స్ విచారణలో తేలడం తో ప్రభుత్వం వారిపై కొరడా ఝళిపించింది. ఈ ఘటన విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలకు సేవలందించే కీలక విభాగం లో అవినీతి చోటుచేసుకోవడం
ఆందోళనకరం గా మారింది. ఈ మధ్య టిజిఎస్‌పిడిసిఎల్ సం స్థ పరిధిలో (ఏసిబి)ని మేనేజ్‌మెంట్ యాంటీ బ్రైబరీ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యం లో ఆ సంస్థలో జరుగుతున్న అవినీతిపై 150 కు పైగా ఫిర్యాదులు ఆ సంస్థకు అందాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఫి ర్యాదుల్లో పేర్కొన్న అంశాలను పరిశీలించి సం బంధిత అధికారుల పాత్రను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. చార్జీంగ్ స్టేషన్‌ల ఏర్పాటు, కొత్త కనెక్షన్‌లు, ప్యానెల్ బో ర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ల మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్టు రుజువయ్యింది. సస్పెండ్ అయిన వారిలో యాదాద్రి జిల్లాలో పనిచేసే ఒక ఏడిఈ, లైన్‌మెన్‌లు, గద్వాల్‌లో ఏఈగా పనిచేస్తున్న అధికారితో పాటు లైన్‌మెన్, మేడ్చల్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న అధికారి, సంగారెడ్డిలో సబ్ ఇంజనీర్‌గా పనిచేసే మరో అధికారి, సైబర్‌సిటీలో పనిచేసే లైన్‌మెన్, హైదరాబాద్ సౌత్‌లో పనిచేసే గ్రేడ్ 3 ఉద్యోగి ఉన్నారు.
శాఖాపరమైన విచారణ
ఈ విచారణలో అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజ నీర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా నగదు రూపంలో జరిగే లంచాల స్థానంలో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించారు. సేవలు అందించేందుకు, ఫైళ్లను త్వరగా పరిష్కరించేందుకు, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు 8 మంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు తేలింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా జరిగిన లావాదేవీలను అధికారులు సాంకేతికంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏడిఈ), అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), సబ్ ఇంజనీర్లు ఉన్నారు. మొత్తం 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే 040 23454884, 7680901912 నెంబర్‌లలో వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.




