
అధికార బలంతో బిజెపికే ఫలం
తెలంగాణలో రెండు స్థానాలు
మహారాష్ట్రలో 7 సీట్లకు పోటీ
సీనియర్ నేత పవార్ స్థానం ఖాళీ
న్యూఢిల్లీ : వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో 2, బీహార్‌లో 5 , హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి.
ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. . కౌంటింగ్ అదేరోజు జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పలు రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి.
మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంవిఎ కలిసికట్టుగా బరిలోకి దిగితే రాజ్యసభకు ఒక్క సీటు విపక్షాల నుంచి దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ ఏర్పడే స్థానాల్లో ప్రముఖులలో ఎన్‌సిపి ఎస్‌పి నేత శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్, టిఎంసి నుంచి సాకేత్ గోఖలే, ఆర్‌పిఐఎ నేత రాందాస్ అతావాఉలే, ఎం తంబుదురై అన్నాడిఎంకె, తిరుచి శివ (డిఎంకె) వంటి వారు ఉన్నారు. ఈ ప్రముఖులలో ఎవరు తిరిగి రాజ్యసభ పోటిని ఎంచకుంటారనేది వెల్లడికాలేదు.




