
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. నిన్న పులి కనిపించిన ప్రాంతానికి వాయువ్య దిశగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తాజా పాదముద్రలు గుర్తించినట్లు హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశామని వెల్లడించారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలు జాగ్రత్త సూచనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.




