
వాషింగ్టన్: స్విట్జర్లాండ్‌పై టారిఫ్‌లు పెంచడం వెనుక విచిత్రమైన కారణాన్ని ట్రంప్ ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో వెల్లడించారు. స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్ కెల్లర్ సట్టర్ సుంకాల గురించి తనతో మాట్లాడిన తీరు నచ్చనందునే సుంకాలు తగ్గించడానికి బదులు 30 శాతం నుంచి 39 శాతానికి పెంచినట్టు అసలు కారణం బయటపెట్టారు. “ స్విట్జర్లాండ్ పై 30 శాతం టారిఫ్‌లు విధించాను. అసలు ఆ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆ దేశ ప్రధాని కాల్ చేశారని అనుకున్నాను . కానీ కాల్ చేసింది వేరొకరు.
“సర్.. మాది చాలా చిన్నదేశం. ఈ సుంకాలు మేం భరించలేం. ” అని అన్నారు. మీది చిన్నదేశమే అయినా అమెరికాతో జరుపుతున్న వాణిజ్యంలో 42 బిలియన్ డాలర్ల మిగులు ఉందని చెప్పాను. అయినా మాది చిన్నదేశం అంటూ ఆమె పదేపదే అదే మాట చెప్పారు. నాకు ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదు. అందుకే 30 శాతం నుంచి 39 శాతానికి పెంచాను. ఎలాంటి సుంకాలు లేకుండా మా దేశానికి స్విస్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ కాల్ చేసింది స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్‌కెల్లర్ సట్టర్ అని తెలిసిందని ట్రంప్ అన్నారు.




