
సర్కారు దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేసింది
వాణిజ్య ఒప్పందంపై రాహుల్ భీకర దాడి
వ్యవసాయ రంగానికి, ఇంధన రంగానికి ముప్పు
బిజెపి ఆర్థిక వనరుల రక్షణకు మోడీ సరెండర్
ఈ డీల్‌ను ఏ ముఖంతో సమర్ధించుకుంటారు?
న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అత్యంత కీలకమైన ఒప్పందం , పైగా మధ్యంతర డీల్‌గా కుదుర్చుకున్నారని . ఇది పూర్తిగా దేశాన్ని హోల్‌సేల్‌గా అమెరికాకు సరెండర్ చేయడమే అని లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలొ పాల్గొంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ఆయువుపట్టు వంటి ఇంధన భద్రతను తీసుకువెళ్లి అమెరికాకు ధారాదత్తం చేశారు.
మన రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. గొంతు నులిమినట్లుగా చేయడం తప్పితే మరో పరిస్థితుల్లో మోడీతో పాటు దేశ ఏ ప్రధాని కూడా ఇటువంటి ఒప్పందానికి తలొగ్గబోరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గొంతు అమెరికా గుప్పిట్లో ఉంది. అందుకే ఆయన భయానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని అర్థం అవుతోందని రాహుల్ తెలిపారు. బడ్జెట్‌పై తమ ప్రసంగాన్నిఆయన ఆద్యంతం మోడీ సర్కారుపై తీవ్ర స్థాయి ఆరోపణలతో కొనసాగించారు.
మల్లయుద్ధం పట్టు టైప్‌లో ట్రంప్
ఇదంతా కూడా మల్లయుద్ధం స్థాయిలో జరిగింది. సాధారణంగా కుస్తీపోటీలో వస్తాదులు ముందుగా ప్రత్యర్థి పై పట్టు సాధిస్తారు. తరువాత వడిసిపట్టుకుని, జారిపోకుండా మెడ పట్టుకుంటారని , ఇప్పుడు ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. శక్తివంతుడు గుప్పిట్లో చిక్కి ప్రత్యర్థి విలవిలలాడుతాడని తెలిపారు. యుద్థాల శకం ముగిసిందని తరచూ ప్రధాని మోడీ, ఎన్ఎస్ఎ అధినేత అజిత్ దోవల్ చెపుతుంటారు. అయితే ఇప్పుడు యుద్థాల శకం లోకి మనం కూరుకుపొయ్యాం. ఉక్రెయిన్‌తో యుద్ధం సాగుతోంది. గాజాలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. మిడిలిస్టు చల్లారడం లేదు.
ఇరాన్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇక మన విషయానికి వస్తే ఆపరేషన్ సిందూర గురించి తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రభుత్వం మన ప్రజలను రక్షించుకోవాల్సి ఉంటుంది. మన డాటా, ఆహార సరఫరా వ్యవస్థ, ఇంధన వ్యవస్థల విషయంలో రాజీకి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి వచ్చి ఉంటే ఈ హయాంలో ట్రేడ్ డీల్ మంతనాలు జరిగితే తాము తప్పనిసరిగా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఇండియా సమానపక్షం అని చెప్పి ఉండేదని అన్నారు. ఇండియన్ డాటా అనేది మనకు కీలకం, భారత్‌ను సమాన స్థాయిలో పరిగణించి చర్చలకు దిగాల్సి ఉంటుందని ట్రంప్‌తో చెప్పి ఉండేవారమని అన్నారు.
నిఘా ఎప్పటికప్పుడు దగా
వారు మనను ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. వారికి నచ్చని వారి నుంచి కొనుగోళ్లకు దిగితే అప్పుడు వారు మనపై ఏకంగా 50 శాతం సుంకాలను విధిస్తారని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ఇంధన రంగం మనకే ఎదురుతిరిగేలా చేసే విధంగా ఇప్పటి ఒప్పందం ఖరారు అయిందని రాహుల్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఈ సభకు వచ్చి ఏ విధంగా సమర్థించుకుంటారు? మనం త్యాగం చేస్తున్నదానికి సిగ్గన్పించడం లేదా అని మోడీ సర్కారుపై రాహుల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. భారత మాతను అమెరికా వీధుల్లో అమ్మినందుకు నామోషీగా లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రసంగిస్తున్నప్పుడు పలుసార్లు అధికార పక్ష ఎంపీలు లేచి ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. నిరాధార ఆరోపణలతో ప్రసంగం సాగదీస్తున్నారని విమర్శించారు. గాలి ఆరోపణలు కాదు, వాటిని నిరూపించుకోవల్సి ఉందన్నారు.
మన చేజేతులా రోడ్డున పడుతున్నాం
ఇప్పుడు మనం సంక్షుభిత కాలంలోకి వెళ్లుతున్నాం.మన కీలక డాటా అమ్ముడుపోయింది. రైతులను నడిబజార్లో నిలిపారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమ్మేశారు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను బజారుకు ఈడ్డారు. మన బలగాలను, మన ఇంధన వనరులను గాలికి వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు. డాటా స్థానికతను ఎత్తివేయడంతో ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆరోపించారు. అమెరికా డాటా విచ్చలవిడిగా ఇక్కడికి తరలివస్తుంది.
పరిమిత డిజిటల్ టాక్స్, సోర్స్ కోడ్ వెల్లడిని తీసివేయడం వంటివి కీలక లోపాలు. పైగా పెద్ద సాంకేతిక పరిశ్రమల కంపెనీలకు 20 సంవత్సరాల టాక్స్ హాలీడే ఇవ్వడం జరిగిందని రాహుల్ తెలిపారు. ఇక టారీఫ్‌ల విషయానికి వస్తే తొలుత కేవలం 3 శాతం వరకూ ఉండేది. ఇప్పుడు ఇది అమెరికా నుంచి పలు సాకులతో 18 శాతానికి చేరింది. అమెరికా నుంచి దిగుమతులు ఏకంగా 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయి. ఇది చాలా దారుణం అని విమర్శించారు. అమెరికా సరుకులపై టారీఫ్‌లను ఒప్పందంతో ఇప్పుడు జీరో స్థాయికి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని రాహుల్ తెలిపారు.




