
న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్య భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 41తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. చెలరేగి ఆడిన ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 8 ఫోర్లతో 80 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర (30),మిఛెల్ (26), సోధి (33) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేక పోయారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఇషాన్ వీర విధ్వంసం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మరో ఓపెనర్ సంజు శాంసన్ (6) మరోసారి నిరాశ పరిచాడు. చెలరేగి ఆడిన అభిషేక్ 16 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 30 పరుగులు చేశాడు. ఆ తకంవాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమపై వేసుకున్నారు. ఇషాన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అతన్ని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అసాధారణ బ్యాటింగ్‌తో విరుచుకు పడిన ఇషాన్ వరుస సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను కనువిందు చేశాడు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 103 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సూర్యతో కలిసి మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 137 పరుగులు జోడించాడు. ఇక సూర్యకుమార్ 30 బంతుల్లోనే ఆరు భారీ సిక్స్‌లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 17 బంతుల్లోనే (42) పరుగులు సాధించాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు 272 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.




