Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedతిరుమల కల్తీ లడ్డూ వివాదం.. ఎపి ప్రభుత్వానికి సిట్ లేఖ

తిరుమల కల్తీ లడ్డూ వివాదం.. ఎపి ప్రభుత్వానికి సిట్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎపిప్రభుత్వానికి నివేదిక రూపంలో ఒక లేఖను సమర్పించింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019-2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలిసింది. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అంశాలను కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తప్పిదాలనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలు, పర్యవేక్షణా విధానాలపై కూడా సిట్ సూచనలు చేసింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సిట్ పంపిన లేఖను పూర్తి గా అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలనే నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక అత్యంత సున్నిత మైన అంశానికి సంబంధించినదైనందున, తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పంది స్తోంది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలు స్తోంది.

భక్తుల విశ్వాసం, టిటిడి సంస్థ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తిరుమల లడ్డూ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తామ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ నివేదికపై పూర్తి స్థాయి అధ్యయనం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే చర్యలు రాజకీయంగా, పరిపాలనపరంగా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ: టిటిడి చైర్మన్ 

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారనీ, కల్టీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు తయారు చేశారని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందన్నారు. నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి భోలే బాబా డెయిరీకి టెండర్లు ఇచ్చారని, గత టిటిడి చైర్మన్, పెద్దల సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించారు. ‘సుబ్బారెడ్డి పిఎ చిన్నప్ప ఖాతాలోకి కోట్లు వచ్చాయి. ఈ ఖాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సిబిఐ వెల్లడించాలి. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని సిబిఐని కోరుతు న్నాం. కూటమి ప్రభుత్వం రాకుంటే ఈ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేది. దుర్మార్గుల నుంచి టిటిడిని మనమంతా కాపాడుకోవాల’ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments