
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు భూమి అప్పగింత
ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు
అదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను త్వరగా పూర్తి చేయాలి
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
వింగ్స్ ఇండియా 2026 అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, భట్టి
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్ పోర్ట్ కల నెరవేరుతోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ ప్రదర్శనలో గురువారం అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు మామునూరు అతిపెద్ద ఎయిర్ పోర్ట్‌గా ఉండేదని అన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు 696 ఎకరాలు మాత్రమే ఉందని అయితే 180 సీట్ల విమానం దిగాలంటే రన్‌వే పొడవు 2500 మీటర్లు ఉండాలని మంత్రి తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కల నెరవేరాలంటే మరో 259ఎకరాలు అవసరమని మంత్రి తెలిపారు.
గతంలో ఎవరూ ఆ భూమిని సేకరించలేదని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డ్ టైమ్‌లో రైతులను ఒప్పించి భూమి సేకరించిందని ప్రశంసించారు. ఏవియేషన్ మంత్రిగా ఎక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలనేది తన లక్ష్యమని, రాష్ట్రాలు సహకరించి భూములు ఇస్తే కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత గొప్ప వారసత్వ నగరమయిన వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా, నిర్మాణం చేసుకోలేక పోయామని, ఇప్పుడు ఆ కల నెరవేరుతోందని అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 5 వేల ఎకరాల్లో నిర్మిస్తామంటే అందరూ నవ్వారని, అన్ని వేల ఎకరాలు ఉండటం వల్లే నేడు ఆపరేషన్, మెయింటెనెన్స్, రిపేర్ కేంద్రాలకు వీలు అవుతోందని, అందువల్లే హైదరాబాద్ ఏవియేషన్ హబ్‌గా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. పోటీపడి రాజకీయాలు చేయడం కాదని, అభివృద్ధి చేయాలని, తెలంగాణను కూడా అభివృద్ధి చేయాలని తన గురువు చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు.
మామునూరు ఎయిర్‌పోర్ట్ కు భూమి అప్పగింత: భట్టి విక్రమార్క
మామునూరు ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన భూమిని సేకరించి కేంద్ర విమానయాన శాఖ కు గురువారం అప్పగించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం అన్నారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాల నిర్మాణ పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీతో 2007లోనే మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు పట్టించుకోకపోవడంతో నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయిన కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర క్యాబినెట్ కోరిందని, దీనికి సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం రాష్ట్రానికి శుభపరిణామమన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్ట్ 1930లో నిజాం కాలంలోనే పనులు మొదలుపెట్టారని, ఇది ఆనాడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దద విమానాశ్రయమని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్షాలకు అనుగుణంగా 2047 నాటికి రాష్ట్ర ఏరో ఇంజన్ హాబ్‌గా అవతరిస్తొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నిర్వహణ, మరమ్మత్తులు, ఆపరేషన్లు (ఎంఆర్‌ఓ)హబ్‌గా మార్చాలనే లక్షంతో ప్రభుత్వం పెట్టుబడిదారులను అన్ని విధాలుగా ఆకర్షిస్తోందని డిప్యూటీ సిఎం అన్నారు.
రెండో రోజు ఆకట్టుకున్న ప్రదర్శనలు
వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ ఎగ్జిబిషన్ రెండో రోజు ఆకట్టుకుంది. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, భారీగా హాజరయ్యారు. పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. వివిధ రకాల స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. దేశంలో విమాన తయారీకి అవసరమయిన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రదర్శించాయి. దీంతో పాటుగా ఆకాశంలో ప్రతి రెండు గంటలకు ఒక సారి జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు చేసిన విన్యాసాలు అలరించాయి. కాగా, ఈ సందర్శనలో పలు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శించారు. చివరి రెండు రోజుల పాటు సాధారణ ప్రజలను ఈ సందర్శనకు అనుమతించనున్నారు.




