
కోహ్లీ శ్రమ వృథా
మూడో వన్డేలోనూ భారత్ చిత్తు
2-1తో సిరీస్ న్యూజిలాండ్ వశం
ఇండోర్: సొంత గడ్డపై టీమిండియా మరో సిరీస్‌ను చేజార్చుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 21తో కివీస్‌కు సమర్పించుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభగాల్లో ఘోరంగా విఫలమై మరో పరాభావాన్ని మూటగట్టుకుంది. అద్భుత సెంచరీతో విరాట్ కోహ్లీ(124) పోరాడినా మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నితీశ్ కుమార్ రెడ్డి(53), హర్షిత్ రాణా(52) హాఫ్ సెంచరీలు చేసినా.. కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (11), శుభమన్ గిల్ (23), శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) ఇలా టాప్ ఆర్డర్ అందరూ చేతులెత్తేశారు. దీంతో 46 ఓవర్లలో 296 పరుగులకే చాపచుట్టేసింది టీమిండియా. న్యూజిలాండ్ బౌలర్లలో ఫోక్స్, క్లార్క్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లెనోక్స్ 2, కైలీ జెమీసన్ 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో తడబడినా డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) అద్భుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు.




