Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedసిఎంను కాపాడేందుకు భట్టి అవాస్తవాలు..

సిఎంను కాపాడేందుకు భట్టి అవాస్తవాలు..

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు

తనకు లేఖ రాస్తే.. సిఎంతో మాట్లాడుతానని భట్టి విక్రమార్క అనటం హాస్యాస్పదం

ఈ స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి

సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు.. ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా..?

సైట్ విజిట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలి

ఎంత మందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి 

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి సిఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు యత్నించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అని చెప్పారు. అంతటి అనుభవం ఉన్న భట్టి విక్రమార్క.. రేవంత్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం పనిచేయటం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి ఓబీ వర్క్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు అని, తనకు లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని భట్టి అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

సింగరేణి స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి అని, సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు.. ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెతను తలపించిందని విమర్శించారు. స్కాంను సమర్థించుకునేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడు కాయ చేశారని అన్నారు. సైనిక్ స్కూల్ లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చి.. వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జనవరిలో సైట్ విజిట్ లేకుండా 7 శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే.. మే నెలలో ఆ నిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. సింగరేణికి వచ్చిన 6,900 కోట్ల లాభాలను దాచిపెట్టి, కార్మికుల బోనస్‌లో కోత విధించారని మండిపడ్డారు. ఆ డబ్బును రేవంత్ రెడ్డి తన సోకులకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బిఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల స్వార్థ్‌ం కోసం వారికి అనుకూలంగా సింగరేణి విధనాలను మార్చారని ఆక్షేపించారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉందని భట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఓబీ వర్క్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదని స్పష్టం చేశారు. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్‌కు టెండర్లు జరిగాయని… వాటికి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదని ప్రస్తావించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ కోసం కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద బుక్‌ను బయట పెట్టాలని కోరారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎవరు..? నష్టం ఎంత..? ఎవరు బాధ్యులో.. భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, నచ్చినవారికి టెండర్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లు భయటపెడతామని వెల్లడించారు.

సింగరేణి స్కామ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది

సింగరేణి స్కామ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని హరీష్‌రావు అన్నారు. 2025 మే నెలలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని, ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టారని చెప్పారు. ప్రతి టెండర్‌కు ప్లస్ టెన్ పద్ధతి అనుసరించారని అన్నారు. స్కామ్‌లు జరగలేదని నమ్మించేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2025 మే నుంచి ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అనేక మంది ఫిర్యాదు చేశారని, తమకు కావాల్సిన వారికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కొంతమంది సైట్ విజిట్ చేసి సెల్ఫీలు తీసుకుని మరీ సింగరేణికి మెయిల్ చేశారని, తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక జిఎం సర్టిఫికేట్ ఇవ్వాలని స్పష్టంగా ఉందని, మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి…ఏ చీకటి ఒప్పందం ఉంది..ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నాయి..? అని నిలదీశారు. టెండర్ల నిబంధనలు మార్చేటప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారని, టెండర్ల రింగ్ మాస్టరైన సిఎం బంధువు ఏ హోటల్‌లో మీటింగ్ పెట్టాడో కూడా తనకు తెలుసని అన్నారు. సైట్ సర్టిఫికెట్ నిబంధన తొలి లబ్ధిదారు శోధా కన్‌స్ట్రక్షన్స్ యజమాని సృజన్‌రెడ్డి అని, ఆయన స్వయానా సిఎం బావమరిది అని చెప్పారు. నైనీ కోల్ బ్లాక్ ఒక్కటే కాదని, సైట్ విజిట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో స్కీంలు లేవు.. కానీ స్కాంలు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు.

సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

సింగరేణి స్కాంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారని ప్రస్తావించారు. తాము బొగ్గు స్కాం అని భయపెట్టగానే నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి, మీడియాని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాను బయటపెట్టిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ- ప్రమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఎందుకంటే సింగరేణిలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవం అని పేర్కొన్నారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయాయులకు టెండర్లు కట్టబెట్టింది నిజం అని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చేశారని, అందుకనే రోజురోజుకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని, బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయని అన్నారు.

రేపో, మాపో మాకు మరో ప్రేమ లేఖ వస్తుంది

సింగరేణి స్కాం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసు వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపో, మాపో తమకు మరో ప్రేమ లేఖ(సిట్ నోటీసు) వస్తుందని ఎద్దేవా చేశారు. తాము ఉద్యమకారులం అని, నోటీసులకు భయపడం అని మరోసారి స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు అని స్పష్టం చేశారు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నదని, సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నదని చెప్పారు.పారదర్శకత ఉంటే ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది..?

సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది, 49 శాతం వాటా కేంద్రానిది అని, ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ గోల్ బ్లాక్ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు తాము వదిలిపెట్టం అని, సిరుల గని సింగరేణిని కాపాడుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments