
దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్‌ఏ) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్‌లను ఎంపిక చేస్తారు. అందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2024=- 25 సంవత్సరానికిగాను నిర్వహించిన పరిశీలనలో భాగంగా ఈ ఎంపిక చేశారు. కేంద్ర బృందం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు. ఎంహెచ్‌ఏ బృందం నిర్వహించిన ఈ ఎంపికలో పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సిసిటిఎన్‌ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి, ఎడిసిపి పురుషోత్తం, ఎసిపి బాలగంగిరెడ్డి , ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్, సిబ్బందిని అభినందించారు.




