
రంగారెడ్డి జిల్లా, మహాలింగాపురం-శంకర్‌పల్లి రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవాబుపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్ చేసుకొని తిరిగి సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురంనకు వెళ్తున్న సూపర్ ట్రావెల్స్ బస్సును మహాలింగాపురం-=శంకర్‌పల్లి మధ్య రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




