
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4వ తేదీన భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆయన భారత్ రష్యాల 23వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరుపుతారని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రష్యా అధినేత భారత్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్వైపాక్షిక సంబందాలు మరింత పటిష్టం అయ్యేందకు ఈ పర్యటన, ఇరు దేశాల వార్షిక సదస్పు ఉపయుక్తం అవుతుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన ఖరారయింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రష్యా అధ్యక్షులు పుతిన్‌కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తారు. పుతిన్‌తో చర్చల దశలో ఉక్రెయిన్‌తో ఘర్షణ, పరిష్కారం విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, పౌర అణు ఇంధన రంగం వంటి కీలక విషయాలపై చర్చలు జరుగుతాయి. ఆపరేషన్ సిందూర్ దశలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ 400 ఉపరితల గగనతల క్షిపణుల అదనపు శ్రేణుల సమీకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.




