
ఆధార్ కార్డు పౌరసత్వ పూర్తి స్థాయి ఆధారం కాదని, ఆధార్ ప్రాతిపదికన ఎన్నికల్లో ఓటుకు విదేశీయులకు అనుమతినిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తుది విచారణల దశలో ఎన్నికల సంఘానికి గురువారం కీలక ప్రశ్నలు సంధించింది. చొరబాటుదార్లు ఆధార్ కార్డులు పొంది ఉంటే వారు ఓటు హక్కుకు అర్హులవుతారా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, యుటిలలో సర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డు వాడకం, ఓటు హక్కు వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఆధార్‌ను పౌరసత్వ నిర్థారణ పత్రంగా పూర్తి స్థాయిలో భావించడానికి వీల్లేదు. ఈ క్రమంలో విదేశీయుల ఓటు హక్కు కూడా పరిగణనలోకి వస్తుందని తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాలా బాగ్చీతో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణను వేగవంతం చేసింది ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు వాడే ఫారం 6 విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఫారంలోని సమాచారం అంతా సరైనదేనా? కాదా అనేది నిర్థారించుకునే అధికారం పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. ఆధారే అన్నింటికీ ఆధారభూతం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా పౌరులు ప్రయోజనాలు పొందేందుకు రూపొందించిన అధికారిక సాధనం అంతే అని తెలిపారు. రేషన్ ఇతర విషయాలకు ఆధార్ జారీ అయిన వ్యక్తులను వారి ఆధార్ ప్రాతిపదికన ఓటరుగా చేర్చడం కుదురుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉదాహరణకు పొరుగుదేశం వ్యక్తి ఎవరైనా ఇక్కడికి వచ్చి రోజువారి కూలీగా పనిచేస్తూ ఉంటే , దీని ద్వారా రేషన్ వంటివి పొందుతూ ఉంటే వారు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదుగా
ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదు. ఫారం 6 లో పొందుపర్చిన వాటన్నింటిని యధావిధిగా అంగీకరిస్తూ పోవల్సిన పనిలేదని , అవుననే వాదన కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు కొందరు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లేవనెత్తిన అంశాలను బెంచ్ తోసిపుచ్చింది. సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం సాధారణ పౌరులపై అనుచిత భారం మోపుతోందని , అనేకులు రాతకోతలతో చిక్కులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల సంఘాన్ని మీరు బట్వాడా విభాగం అనుకుంటున్నారా? అని చురకలు పెట్టింది. అత్యధిక వివరణలతో చివరికి ఓటరు కార్డులు తొలిగిపోయిన వారు ఉన్నారనే సిబల్ వాదన సరికాదని బెంచ్ తెలిపింది.
రివిజన్ ఇసి విద్యుక్త ధర్మం కాదనడానికి వీల్లేదు
రివిజన్ అనేది ఎన్నికల సంఘం అధికారంలో ఓ భాగం. దీని వల్ల ప్రజాస్వామికమైన ఓటుహక్కుకు విఘాతం ఏర్పడుతోందనే వాదన సమంజసమా? అని ప్రశ్నించారు. సరైన నోటీసు తరువాతనే జాబితాల్లో నుంచి పేర్ల తొలిగింపులు ఉంటాయని, ఇది తప్పనిసరి అని న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రక్రియ సాగుతున్న దశలో ప్రత్యేక సందేహాలు సవాళ్లకు కోర్టు నిర్ధేశిత గడువులను విధించింది. తమిళనాడు పిటిషన్లపై ఎన్నికల సంఘం డిసెంబర్ 1లోగా వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కేరళ పిటిషన్లపై విచారణ రెండున జరుగుతుంది. ఇక బెంగాల్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణ 9వ తేదీన ఉంటుంది. ఈ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సర్ ప్రక్రియపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని వీటికి ప్రత్యేక నిర్థిష్ట గడువును ఖరారు చేశారు.




