
సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని, ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరిదో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తులో 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులెవరని తేల్చలేదా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే డిఎస్పిని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజిని సిజె నిలదీశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని సిజె ప్రశ్నించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తరపు న్యాయవారి వసుధా వాదనలు వినిపించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణల కమిటీ పరిశ్రమల నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిందని, నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు. పేలుడు తీవ్రతకు ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వసుధా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ రజినీకాంత్ కోర్టుకు తెలిపారు. దీనికిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.




